logo

అక్రమాలకు ఎమ్మెల్యే కన్నబాబు దన్ను

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలన్న సీఎం జగన్‌ ఆదేశాలు సెజ్‌లో అమలు కావడం లేదని వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోరుపోలు చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 23 Feb 2024 02:42 IST

అఖిల పక్ష నాయకుల ఆరోపణ

మాట్లాడుతున్న వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు చిన్నారావు, తెదేపా, జనసేన నాయకులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలన్న సీఎం జగన్‌ ఆదేశాలు సెజ్‌లో అమలు కావడం లేదని వైకాపా ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోరుపోలు చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుతాపురం మండలకేంద్రంలో తెదేపా, జనసేన నాయకులతో కలిసి గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. సెజ్‌లో బయటవాళ్లకే పనులు, ఉన్నత ఉద్యోగాలు అందుతున్నాయని.. స్థానికుల పేరు చెబితే ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యను వైకాపా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సెజ్‌లో అవినీతి గురించి ప్రస్తావిస్తే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఎమ్మెల్యే కన్నబాబు వర్గీయులు స్పందిస్తున్నారని విమర్శించారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు జనపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దిబ్బపాలెం సెజ్‌ కాలనీలో ఇంటిస్థలాల పంపిణీలో అక్రమాలు అన్నీ కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలోనే జరిగాయని, దీనికి ఆయన బాధ్యత వహించాలన్నారు. జనసేన మండల పార్టీ అధ్యక్షులు బైలపూడి రాందాసు మాట్లాడుతూ సెజ్‌ విషయంలో మొదటి నుంచి నిర్వాసితులను మోసగిస్తున్న చరిత్ర వైకాపా నాయకులకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కన్నబాబు వెనుక తిరిగే వ్యక్తి 27 ఇంటిస్థలాలు కొట్టేశాడని, నిర్వాసితులకు దక్కాల్సిన పనులను బినామీలకు అందిస్తూ ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు లక్ష క్యూబిక్‌ మీటర్ల మట్టిని ప్రభుత్వానికి పైసా కట్టకుండా కన్నబాబు కాజేశారని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని వైకాపా నిర్వాసిత నాయకుడు రాజాన బాషా సవాల్‌ విసిరారు. సమావేశంలో వైకాపాకు చెందిన ద్వారపురెడ్డి బాబ్జీ, పోలార్పు పారునాయుడు, పీలా సందీప్‌, రావి దేముడు, చుక్కా అనురాధ, మేరుగు అప్పలనాయుడు, తెదేపా నాయకులు పీలా తులసీరామ్‌, జనసేన నాయకులు చోడిపల్లి అప్పారావు, ఎరిపల్లి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని