logo

ఎలమంచిలిలో పైవంతెన ప్రారంభం

ఎలమంచిలి పట్టణంలో 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయిన రైల్వే పైవంతెన ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ప్రధాన సమస్య పరిష్కారమైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

Updated : 23 Feb 2024 05:15 IST

పైవంతెన ప్రారంభిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా, చిత్రంలో ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, ఛైర్‌పర్సన్‌ రమాకుమారి, సుకుమార్‌వర్మ తదితరులు

ఎలమంచిలి న్యూస్‌టుడే: ఎలమంచిలి పట్టణంలో 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయిన రైల్వే పైవంతెన ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ప్రధాన సమస్య పరిష్కారమైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన పైవంతెనను ఆయన గురువారం రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరించారు. పదిహేనేళ్లగా ఈ వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. రమణమూర్తిరాజు (కన్నబాబు) ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే దీన్ని అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. వైకాపా పాలనా కాలం ముగిసిపోతున్నా వంతెన అందుబాటులోకి రాకపోవడంపై ‘ఈనాడు’లో ఈ నెల 8న ‘15 ఏళ్లలో పైవంతెన కట్టలేరా?’ అంటూ కన్నబాబును సూటిగా ప్రశ్నిస్తూ కథనం ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వంతెన పనులు చేపట్టిన ముగ్గురు గుత్తేదారులు వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. చివరకు వేరే నిర్మాణ సంస్థను ఒప్పించి పనులు ప్రారంభించామని చెప్పారు. గేటు పడితే అరగంటకు పైనే వాహనాలు నిలిచిపోయేవని, తాను కూడా చాలాసార్లు ఇబ్బందులు పడ్డానని గుర్తుచేసుకున్నారు. వంతెనపై వేసిన కాంక్రీట్‌ మరో కొన్ని రోజులు తడపాల్సి ఉన్నందున ఈ నెల 29 ఉదయం నుంచి అన్ని వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. ఏషియన్‌ పెయింట్స్‌ సహకారంతో ఎలమంచిలి పెంజెరువును రూ. 15 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి మాట్లాడుతూ ఎలమంచిలిలో రెండు పార్కులు నిర్మిస్తున్నామన్నారు. వీటికి తులసీ, సత్యంరాజు పార్కులుగా పేర్లు పెట్టామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్‌ఈ కె.కాంతిమతి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా, ఎంపీపీ బోదెపు గోవింద్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బొద్దపు ఎర్రయ్యదొర, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌ వర్మ, కర్రి శివ, మున్సిపల్‌ కౌన్సిలర్లు సంధ్య, మరిడేశ్వరరావు, వెంకట్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని