logo

గొంపలో వైకాపా నేతల బరితెగింపు

ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. రూ.15.5 లక్షలకు గ్రామకంఠం స్థలానికి వేలం ఖరారు చేశారు.

Published : 23 Feb 2024 02:45 IST

గ్రామకంఠం స్థలానికి బహిరంగ వేలం 

గ్రామకంఠంలోని వాటర్‌ ట్యాంకు, మోటారు షెడ్డు

రావికమతం (చోడవరం), న్యూస్‌టుడే: ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. రూ.15.5 లక్షలకు గ్రామకంఠం స్థలానికి వేలం ఖరారు చేశారు. ఇదేదో రెవెన్యూ అధికారులు నిర్వహించిన వేలం కాదు. రావికమతం మండలం గొంపలో వైకాపాకు చెందిన నాయకులు ఆక్రమించి మరీ వేసిన బహిరంగ వేలం. పిల్లా సత్యారావు రూ.15.50 లక్షలకు పాడుకుని ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే స్థలంలోని తుప్పలను తొలగించి నిర్మాణాలు చేపట్టేందుకు ఇసుక తెప్పించారు. ఇంత జరుగుతున్నా.. గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

  • గొంప ఒకప్పటి నియోజకవర్గ కేంద్రం.. ఈ గ్రామం 1977 వరకు నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం జనాభా 3,200 వరకు ఉంది. ఇక్కడ వైకాపా వారిదే ఆధిపత్యం. సర్పంచిగా వైకాపాకు చెందిన కంట్రెడ్డి గోవింద ఉన్నారు. సర్వే నంబరు 61లోని గ్రామకంఠం స్థలంలో శిథిలావస్థకు చేరిన పాత పంచాయతీ భవనాన్ని తొలగించి గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించి ఇటీవల ప్రారంభించారు. సచివాలయ భవనాన్ని ఆనుకుని సర్వే నంబరు.61లో ఆరు సెంట్ల వరకు గ్రామ కంఠం స్థలం ఉంది. ఇందులోని కొంత భాగంలో 2018 వరకు నేల బావి ఉండేది. ఆరోగ్య ఉప కేంద్రం అద్దె ఇంట్లో కొనసాగేది. 2008లో అప్పటి సర్పంచి అధికారి రాజు ఆరోగ్య ఉప కేంద్ర భవనం బావి స్థలంలో నిర్మించాలని పంచాయతీ తీర్మానం చేయించారు. 2014-19 మధ్య సర్పంచిగా వ్యవహరించిన బొర్రా శ్రీను, అప్పటి పాలకవర్గం ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం కోసం నేల బావిని పూడ్పించారు.
  •  వైకాపా అధికారంలోకి వచ్చాక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. గ్రామకంఠం తమదంటూ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పిల్లా, తోట కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని ఆక్రమించారు. రెండు కుటుంబాల్లోని ఎవరో ఒకరికే ఆ స్థలం దఖలు పడేలా, విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును రెండు వాటాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. ఇటీవల పిల్లా సత్యారావు, గోవింద, తోట సునీల్‌, రామారావు సమక్షంలో వేలం నిర్వహించగా.. సత్యారావు రూ.15.5 లక్షలకు వేలం పాడి ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నారు. గ్రామకంఠాన్ని ఆక్రమించి వేలం నిర్వహించిన వీరంతా సర్పంచి కంట్రెడ్డి గోవింద వర్గీయులు. సర్పంచి అండతోనే ఇదంతా జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
  • పంచాయతీ కార్యదర్శి సతీష్‌ను వివరణ కోరగా.. ‘సర్వే నంబరు 61లోది గ్రామకంఠమే. దీనికి వేలం పాట నిర్వహించినట్లు తెలీదు. ఆ స్థలం ఎవరి పరం కాకుండా తహసీల్దారు దృష్టికి తీసుకెళ్తామ’ని చెప్పారు. వీఆర్వో డొంకా అప్పారావు మాట్లాడుతూ.. గ్రామకంఠం స్థలానికి వేలం నిర్వహించినట్లు అందిన సమాచారంపై గ్రామస్థులను ఆరా తీయగా.. వాస్తవమేనని తేలిందన్నారు.
  • సర్పంచి గోవింద దృష్టికి తీసుకెళ్లగా.. వేలం విషయం తనకు తెలియదని, వారు తన   వర్గీయులు కాదని పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని