logo

బొత్సపై సరైన అభ్యర్థినని పార్టీ భావించింది: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు తనను సరైన అభ్యర్థిగా పార్టీ భావించిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 23 Feb 2024 08:58 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

ఈనాడు, విశాఖపట్నం: మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు తనను సరైన అభ్యర్థిగా పార్టీ భావించిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన శంఖారావం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గురువారం విశాఖలో గంటా విలేకరుల సమావేశం నిర్వహించారు.  విలేకరులడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. పార్టీ అన్నీ ఆలోచించి చీపురుపల్లిలో సీనియర్‌ లీడర్‌పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టిందన్నారు. తాను ఇప్పటి వరకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో చోడవరం, అనకాపల్లి, విశాఖ జిల్లా పరిధిలో భీమిలి, ఉత్తరం నియోజకవర్గాల్లో పోటీ చేశానన్నారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని తెలిపారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందో అన్ని రకాలుగా అంచనాలు వేసి మొదటే పార్టీ ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. ఆ ప్రకారమే చీపురుపల్లి ప్రతిపాదన తీసుకొచ్చారని, తప్పనిసరిగా దాని గురించి ఆలోచించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పార్టీ అధిష్ఠానంతో మాట్లాడుతానన్నారు. ‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెదేపా-జనసేన పొత్తులకు సంబంధించి కొన్ని సీట్లపైనే స్పష్టత వచ్చిందని, వారం రోజుల్లో తుది జాబితా ప్రకటించే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని