logo

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!!

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. రెండు ఐపీˆఎల్‌ మ్యాచ్‌లకు నగరం వేదికకానుంది. గురువారం ‘ఐపీఎల్‌ 2024’ షెడ్యూలును నిర్వాహకులు ప్రకటించారు.

Published : 23 Feb 2024 02:49 IST

విశాఖకు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కేటాయింపు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. రెండు ఐపీˆఎల్‌ మ్యాచ్‌లకు నగరం వేదికకానుంది. గురువారం ‘ఐపీఎల్‌ 2024’ షెడ్యూలును నిర్వాహకులు ప్రకటించారు. పీఎంపాలెంలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 31న దిల్లీ క్యాపిటల్స్‌ -చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్‌ 3న దిల్లీ క్యాపిటల్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు ఆడనున్నాయి. విశాఖ క్రికెట్‌ ప్రేమికులు ఐపీఎల్‌ మ్యాచ్‌లు తిలకించి నాలుగేళ్ల అవుతుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్‌ షెడ్యూలు విడుదలవడం ... అందులో విశాఖకు మ్యాచ్‌లు కేటాయించకపోవడంతో నిరాశలో మునిగిపోయేవారు. ఈసారి రెండు మ్యాచ్‌లు విశాఖలో జరగనుండటంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. అభిమాన క్రికెటర్లను తిలకించేందుకు, బౌండరీలు, సిక్సర్లు బాదే వారి ఆటను ఆస్వాదించేందుకు క్రికెట్‌ ప్రేమికులు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో విశాఖకు రెండు మ్యాచ్‌లు కేటాయించడంతో దిల్లీ క్యాపిటల్స్‌ కోఓనర్స్‌ కిరణ్‌కుమార్‌, జిందాల్‌కు ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.శరత్‌చంద్రారెడ్డి, ఎస్‌.ఆర్‌. గోపీనాథరెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ తిలకించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు కోలాహలం నెలకొంది. గత ఏడాది నవంబరులో జరిగిన భారత్‌- ఆస్ట్రేలియా టీ-20 కూడా అభిమానులను ఉర్రూతలూగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని