logo

సుందరీకరణ గండం!

వైకాపా ప్రభుత్వ తీరు జీవవైవిధ్యానికే ముప్పు తెస్తోంది. విశాఖ బీచ్‌లలో సుందరీకరణ పనులు అరుదైన తాబేళ్ల జాతికి శాపంగా మారాయి.

Published : 23 Feb 2024 02:50 IST

తీరంలో ఇష్టారాజ్యంగా పనులు
తాబేళ్ల రాకకు అడ్డంకులు

ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపునకు తీరంలో వినియోగించిన యంత్రం

ఈనాడు, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వ తీరు జీవవైవిధ్యానికే ముప్పు తెస్తోంది. విశాఖ బీచ్‌లలో సుందరీకరణ పనులు అరుదైన తాబేళ్ల జాతికి శాపంగా మారాయి. వాటి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆలివ్‌రిడ్లే, గ్రీన్‌ టర్టిల్‌, హాక్స్‌బిల్‌ జాతికి చెందిన తాబేళ్లు విశాఖ తీరానికి అధికంగా వస్తుంటాయి. ఇవి మెక్సికన్‌ తీరాల నుంచి బంగాళాఖాతం మీదుగా ప్రయాణించే సమయంలో తీరంలో తెల్లటి ఏటవాలు ఇసుక తిన్నెలను ఇష్టపడతాయి. వాటికి సహజమైన గూడుగా భావిస్తాయి.

ఏటా జనవరి నుంచి మే వరకు నగర పరిధిలోని ఆర్‌కే బీచ్‌, జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, తొట్లకొండ, పెదనాగమయ్యపాలెం, సాగర్‌నగర్‌, రుషికొండ, ముత్యాలమ్మపాలెం పరిసరాల్లో గుడ్లు పెడతాయి. పర్యావరణానికి ఈ తాబేళ్లు ఎంతో మేలు చేస్తాయి. అందుకే అటవీశాఖ అధికారులు వీటిని సేకరించి.. పిల్లలు పుట్టిన తరువాత సాగరంలో విడిచిపెడతారు. అయితే...కొంతకాలంగా సేకరిస్తున్న గుడ్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది.

అలా తొలగించారు..

‘జి-20 సన్నాహక సదస్సు’ సమయంలో సుందరీకరణ పేరుతో ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక తిన్నెలను ఇష్టారాజ్యంగా తవ్వేశారు. పలు చోట్ల అటవీశాఖ నిబంధనలను అతిక్రమించారు. తాబేళ్లకు ఆవాసంగా ఉండే చిన్నపాటి పొదలు, ఆకు మొక్కలు, చెట్లను కూకటి వేళ్లతో తొలగించారు. కొన్నిచోట్ల జేసీబీలను బీచ్‌లోకి తీసుకొచ్చి మరీ తొక్కించారు. అభివృద్ధి పనులంటూ మంగమారిపేట, సాగర్‌నగర్‌, తెన్నేటిపార్క్‌, అప్పూఘర్‌, భీమిలి వద్ద సిమెంటు నిర్మాణాలు చేపట్టారు.  ఎక్కడికక్కడ విద్యుత్తు స్తంభాలు, సిమెంటు బల్లలు నిర్మించేశారు. తీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల ఏరివేతకు కొత్తగా తీసుకొచ్చిన భారీ యంత్రాలతో ఇసుక తిన్నెల్లో పనులు చేయడంతో తాబేళ్ల గూళ్ల నాశనానికి కారణం అవుతున్నాయి.

విద్యుత్తు దీపాలతో..

తాబేళ్లు సాధారణంగా రాత్రిళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. మిరిమిట్లు గొలిపే విద్యుత్తు వెలుగులు ఉంటే  వెనక్కి వెళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు.  ‘జి-20’, బీచ్‌ సుందరీకరణ పనుల్లో తీరమంతా ఎక్కడికక్కడ దీపాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చే చోట జీవీఎంసీ అధికారులు కొత్తగా పదుల సంఖ్యలో స్తంభాలు వేసి మరీ దీపాలు అమర్చారు. రుషికొండ వద్ద తవ్విన గ్రావెల్‌ను పలు చోట్ల సముద్ర తీరంలో డంపు చేశారు. ఇది సముద్రం వైపు జారి...ఇసుక తిన్నెల సహజ స్థితి చెల్లాచెదురయింది. అనువైన ఇసుక తిన్నెలు కనిపించక తాబేళ్ల రాక తగ్గిపోయింది. ‘గతంలో ఏర్పాటు చేసిన కొన్ని విద్యుత్తు స్తంభాలను ఇప్పటికే తొలగించాం. సాగర్‌నగర్‌ మరికొన్ని చోట్ల బీచ్‌ వైపు వెలుగుతున్న దీపాలను నిలిపేశాం. తాబేళ్ల ఆవాసానికి వీలుగా 25 ఎకరాల్లో కొత్తగా మొక్కలు నాటి పెంచుతున్నాం’ అని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని