logo

వినీలాకాశంలో.. ‘మిలాన్‌’ మెరుపులు

‘మిలాన్‌-2024’ నేపథ్యంలో అంతర్జాతీయ నగర కవాతుకు ఆర్కే బీచ్‌ వేదికైంది. నౌకాదళం ఆధ్వర్యంలో గగన తలంలో, సముద్ర జలాల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అబ్బురపరచాయి.

Updated : 23 Feb 2024 05:13 IST

ఆర్కే బీచ్‌లో ఘనంగా అంతర్జాతీయ నగర కవాతు

సాగర జలాల్లో త్రివర్ణ శోభ

‘మిలాన్‌-2024’ నేపథ్యంలో అంతర్జాతీయ నగర కవాతుకు ఆర్కే బీచ్‌ వేదికైంది. నౌకాదళం ఆధ్వర్యంలో గగన తలంలో, సముద్ర జలాల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అబ్బురపరచాయి. యుద్ధ సమయంలో ప్రదర్శించే వ్యూహాత్మక విన్యాసాలతో ‘హాక్‌ జెట్లు’ ఔరా అనిపించాయి. యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

సభావేదికపై కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌, నేవీ చీఫ్‌ హరికుమార్‌, జీవీఎంసీ మేయర్‌ హరివెంకట కుమారి

చేతక్‌ హెలికాప్టర్లు అద్వితీయ ప్రదర్శనతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సముద్రంలో చిక్కుకున్న మెరైన్‌ కమాండోలను చేతక్‌, యూహెచ్‌వీహెచ్‌, అడ్వాన్స్డ్‌ లైట్‌ హెలికాప్టర్ల సహకారంతో, శత్రువుల చెరలో చిక్కుకున్న బాధితులను కాపాడే ఘట్టాన్ని ప్రదర్శించారు.

  • ఐఎన్‌ఎస్‌ కర్ణకు చెందిన కమాండోలు 8,000 అడుగుల ఎత్తులో ఉన్న అడ్వాన్స్డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ నుంచి పారాచ్యూట్‌ సహకారంతో కిందికి  దిగి జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
  • కమాండర్‌ రాజీవ్‌ ప్రసన్న నేతృత్వంలో మిగ్‌ 29 విమానాలు 8 ఆకారంలో, చురుకైన మలుపులతో గర్జన చేస్తూ వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. స్వదేశీయంగా రూపొందిన తేజస్‌ విమానాలు తొలిసారిగా విశాఖ గగనతలంలో సందడి చేశాయి.
  • అనంతరం 50కి పైగా దేశాలకు చెందిన నౌకాదళ బృందాలు ఆర్కే బీచ్‌ రోడ్డులో కవాతు నిర్వహించారు. అనంతరం నేవీ పాఠశాలకు చెందిన 205 మంది విద్యార్థులు వివిధ రంగులకు అర్థం చెబుతూ నృత్యం ప్రదర్శించారు. సీ క్యాడెట్‌ కార్ప్స్‌కు చెందిన 55 మంది చిన్నారులు ‘హార్న్‌పైప్‌ డ్యాన్స్‌’ చేశారు. కూచిపూడి, గరగ, థింసా, కొమ్ము కోయ నృత్యాలు, తప్పెటగుళ్లు, నవరత్నాలు, స్మార్ట్‌ సిటీకి చెందిన శకటాలు సందడి చేశాయి. కార్యక్రమం చివరిలో ప్రదర్శించిన లేజర్‌ షో, బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి.

ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్ల నుంచి బాంబులు కురిపిస్తూ..

విన్యాసాల్లో యుద్ధ హెలికాప్టర్‌

విద్యుద్దీపాల కాంతుల్లో యుద్ధనౌకలు

వివిధ దేశాల జెండాలతో కవాతు

కవాతు చేస్తున్న రష్యా నౌకాదళ సభ్యులు

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని