logo

భార్యపై అనుమానంతో ఒకరి హత్య..

రోలుగుంట మండలం కొవ్వూరులో 2017లో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఏడో ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 24 Feb 2024 03:08 IST

నిందితుడికి జీవిత ఖైదు

రోలుగుంట, న్యూస్‌టుడే: రోలుగుంట మండలం కొవ్వూరులో 2017లో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నం ఏడో ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఎస్పీ మురళీకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొవ్వూరుకు చెందిన అద్దేపల్లి నూకాలతల్లి, అప్పారావు భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన మంత్రి సత్తిబాబుతో నూకాలతల్లి సఖ్యతగా ఉంటోందని అప్పారావు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సత్తిబాబును చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. 2017 మే 21న ఆంజనేయస్వామి గుడి వద్ద భజనకు వెళ్లిన సత్తిబాబు అక్కడ్నుంచి మధ్యలో వెళ్లిపోయాడు. నూకాలతల్లితో ఇంటి మేడపై మాట్లాడుతుండటాన్ని గమనించిన అప్పారావు.. ఇటుకతో సత్తిబాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తల, చెవి, ముక్కు, నోరు నుంచి తీవ్ర రక్తస్రావమై సత్తిబాబు మరణించాడు. ఈమేరకు అతని సోదరుడు మంత్రి అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అప్పటి కొత్తకోట సీఐ కోటేశ్వరరావు నేతృత్వంలో దర్యాప్తు జరిగింది. నిందితుడు అద్దేపల్లి అప్పారావును అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వాదప్రతివాదనలు ముగిసి నేరం రుజువు కావడంతో ఏడీజే కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్‌ పైవిధంగా తీర్పు ఇచ్చారని ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని