logo

AP News: ఇంటర్‌ బోర్డు వింతలు ఇన్నిన్ని కాదయా!

దివ్యాంగులు కనిపిస్తే అయ్యో పాపం అంటూ చేతనైన సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇంటర్‌బోర్డు అధికారులు మాత్రం దయలేకుండా దూరంగా పరీక్ష కేంద్రాలను కేటాయించిన ఉదంతం అచ్యుతాపురంలో వెలుగుచూసింది.

Updated : 24 Feb 2024 09:19 IST

ముడుపులివ్వలేదని ముప్పుతిప్పలు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

దివ్యాంగులు కనిపిస్తే అయ్యో పాపం అంటూ చేతనైన సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇంటర్‌బోర్డు అధికారులు మాత్రం దయలేకుండా దూరంగా పరీక్ష కేంద్రాలను కేటాయించిన ఉదంతం అచ్యుతాపురంలో వెలుగుచూసింది.

గన్‌ ప్రభుత్వంలో వైకాపా నాయకులతోపాటు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే చందంగా మాట వినని కళాశాల యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నించారు. తమ మాట వినకపోతే పరిస్థితులు ఈవిధంగానే ఉంటాయని మిగిలిన కళాశాలలకు తెలిసేలా దివ్యాంగులను సైతం దూర కేంద్రాలకు తరలించారు. పరీక్షల సమయంలో పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు ఇప్పుడు పరీక్షా కేంద్రాల గురించి కలవరం చెందుతున్నారు.
అచ్యుతాపురంలో నాలుగు ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఓ కళాశాలలో 302 మంది ఇంటర్‌ చదువుతున్నారు. వీరిలో 200 మంది బాలికలు ఉండగా అందులో 15 మంది అంధ, చెవిటి, మూగ, శారీరక వైకల్యంతో ఉన్న విద్యార్థులు. మిగిలిన మూడు కళాశాలల్లో 900 మంది విద్యార్థులు. వీరందరికీ స్థానికంగానే పరీక్ష కేంద్రాన్ని ఇంటర్‌ అధికారులు కేటాయించారు. దివ్యాంగ విద్యార్థులున్న కళాశాల వారికి మాత్రం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొక్కిరాపల్లి, తాళ్లపాలెం గురుకుల పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. తమకు దూరంగా ఉన్న కేంద్రాలను కేటాయించడంపై దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అధికారులకు ముడుపులు ఇవ్వలేదనే కారణాలతోనే కళాశాల యాజమాన్యంపై పగబట్టి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ కళాశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రైల్వేగేట్లు దాటి పరీక్షా కేంద్రాలకు ఏవిధంగా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌ అధికారుల తీరుపై స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.


దీనిపై డీఐఈఓ సుజాతను వివరణ కోరగా ఇంటర్‌ విద్యార్థుల  వివరాలు సేకరించి బోర్డుకు పంపించామని, తమ ప్రమేయం లేకుండా కేంద్రాలు కేటాయింపు జరిగిందన్నారు. కేంద్రాల కేటాయింపు తన పరిధిలోని అంశం కాదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని