logo

చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు

నగర పరిధిలో  పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడు కె.శ్రీనివాస్‌ అలియాస్‌ కృష్ణమోహన్‌ను అరెస్టు చేసినట్లు డి.సి.పి. (క్రైమ్‌) వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీసు సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

Published : 24 Feb 2024 03:18 IST

అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నగర పరిధిలో  పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడు కె.శ్రీనివాస్‌ అలియాస్‌ కృష్ణమోహన్‌ను అరెస్టు చేసినట్లు డి.సి.పి. (క్రైమ్‌) వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీసు సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మధురానగర్‌లోని కీర్తన రెసిడెన్సీకి చెందిన సూర్యప్రసాద్‌ ఇంట్లో లేనప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి అందులో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరించారు. పాత నేరస్థుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్‌ దరి తిరుమల టవర్స్‌లో నివాసముంటున్న పాత నేరస్థుడు కామేపల్లి శ్రీనివాస్‌ అలియాస్‌ కృష్ణమోహన్‌ అలియాస్‌ క్రిష్‌, అలియాస్‌ కార్తిక్‌ను విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు దరి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీటెక్‌ వరకు చదివి సినిమాలపై వ్యామోహంతో హైదరాబాద్‌ వెళ్లి కొన్నాళ్లు సినీ పరిశ్రమలో పనిచేశాడు. అక్కడ వ్యసనాలకు బానిసగా మారి ఇళ్లల్లో దొంగతనాలు మొదలుపెట్టాడు. చోరీలు చేస్తూ ఆ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో గోవా, బెంగళూరు, మైసూర్‌ వెళ్లి అక్కడ జల్సాలు చేస్తూ గుర్రపు స్వారీ రేస్‌లకు ఉపయోగించేవాడు.

నిందితుడు పగలు రెక్కీ నిర్వహించి, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కృష్ణమోహన్‌పై ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మొత్తం 144 కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడి నుంచి రూ.12.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 197 గ్రాముల బంగారు ఆభరణాలను మైసూర్‌లో అమ్మినట్లు నిందితుడు అంగీకరించాడు. కార్యక్రమంలో ఎ.డి.సి.పి. (క్రైమ్‌) గంగాధరం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని