logo

ఓట్ల తొలగింపునకు.. సీఈవో అనుమతి తప్పనిసరి

ఓటరు జాబితా నుంచి ఒక ఓటు తొలగించాలంటే ఎన్నికల కమిషన్‌ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అనుమతి లేకుండా తొలగించకూడదని ఆదేశించింది.

Published : 24 Feb 2024 03:35 IST

పెండింగ్‌లో 7251 దరఖాస్తులు
తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నుంచి అత్యధికం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఓటరు జాబితా నుంచి ఒక ఓటు తొలగించాలంటే ఎన్నికల కమిషన్‌ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అనుమతి లేకుండా తొలగించకూడదని ఆదేశించింది. ఈ మేరకు సీఈఓ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • గతంలో మాదిరిగా ఎవరో చేసిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఓట్లను తొలగించడం ఇక మీదట కుదరదు. గత నెల 22న జిల్లాలో తుది ఓటరు జాబితాలు విడుదల అయ్యాయి. అప్పటి నుంచి మళ్లీ తొలగింపులు, మార్పులు, చేర్పులకు ఆన్‌లైన్‌లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 60,437 దరఖాస్తులు రాగా వాటిల్లో 27,060 పరిష్కరించారు.
  • ఓటరు జాబితాల సవరణ ప్రారంభమైనప్పటి నుంచి ఓట్ల తొలగింపులపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేశారని ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి 10 మంది వైకాపా నాయకులు ఆయా దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. పశ్చిమ నియోజకవర్గ ఆర్‌ఓ, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ ఆదేశాల మేరకు వారిపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా విధులు నిర్వహించకూడదు. వీరితో పాటు మరో 13 మందిపై చర్యలకు సిఫార్సు చేశారు. వీరంతా అయిదేసి ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. వారిపై కేసులు నమోదు చేయకున్నప్పటికీ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. వీరు సైతం ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
  • తాజా పరిణామాల నేపథ్యంలో ఓటరు నమోదు అధికారులు (ఈఆర్‌ఓ) కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపులకు సంబంధించి 7251 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.. వీటిలో ఎక్కువగా విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గాల పరిధిలోనివి ఉన్నాయి. తుది ఆమోదం కోసం వీటిని సీఈఓ కార్యాలయానికి నివేదిస్తున్నారు. నమోదులకు సంబంధించి విశాఖ తూర్పు 3199, భీమునిపట్నం 2644, దక్షిణం 1659, ఉత్తరం 3040, పశ్చిమ 1621, గాజువాక 2792, పెందుర్తి 2076 చొప్పున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు