logo

సిబ్బంది పెరిగినా.. సేవలు అరకొరే..

ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తమ వైద్యసేవల కోసం నెలకొల్పిన విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌)లో పూర్తిస్థాయిలో సేవలందట్లేదు. పెద్ద సంఖ్యలో వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నా చికిత్స పొందుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో బాధితులు కేజీహెచ్‌కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.

Updated : 24 Feb 2024 03:50 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తమ వైద్యసేవల కోసం నెలకొల్పిన విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌)లో పూర్తిస్థాయిలో సేవలందట్లేదు. పెద్ద సంఖ్యలో వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నా చికిత్స పొందుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో బాధితులు కేజీహెచ్‌కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.

విమ్స్‌లో మొత్తం 650 పడకలుండగా 450 వరకు వినియోగించుకునేందుకు అనుమతులున్నాయి. గతంలో 32 మంది వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి డిప్యుటేషన్‌పై పనిచేసేవారు. క్రమంగా ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని విధంగా జీతాలు పెంచారు. ప్రస్తుతం కీలక విభాగాలన్నింటిలో మొత్తం 57 మంది వైద్యులున్నారు. వీరితోపాటు 212 మంది స్టాఫ్‌ నర్సులు, 187 మంది పారామెడికల్‌, ఇతర విభాగాల సిబ్బందితో కలసి మొత్తం 600 మంది పనిచేస్తున్నారు. వారందరికీ జీతాలకు నెలకు రూ.2 కోట్లకు పైగా ఖర్చవుతోంది. కానీ బెడ్‌ ఆక్యుపెన్సీ 16 శాతానికే పరిమితమైంది. 150 నుంచి 180 పడకల వరకు మాత్రమే నిండుతున్నాయి. ఇదే విషయమై ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు ఆసుపత్రి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. కానీ దీనికిగల కారణాలు, పరిష్కారాలపై ఆసుపత్రి అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.


జూనియర్లే అధికం..

సిబ్బంది పెరిగినా.. సేవలు అరకొరే..సుపత్రిలో వైద్యుల నియామకాలను స్థానికంగా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూల ద్వారా చేపడుతున్నారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.1.60 లక్షలు, జనరల్‌ మెడిసిన్‌కు చెందినవారికి రూ.1.10 లక్షలు చెల్లిస్తున్నారు. జీతాలు పెంచడంతో ఎక్కువ మంది ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నా మెరుగైన సేవలపై దృష్టి పెట్టడం లేదు. మరికొందరు ఇక్కడ పనిచేస్తూనే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఆర్థోపెడిక్‌ మినహా అన్ని విభాగాల్లో జూనియర్లే వైద్యులుగా ఉన్నారు. పల్మనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్‌ మినహా మిగిలిన విభాగాల్లో వైద్యులు బాధ్యతగా పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేరుగా ఈ ప్రక్రియ చేపడితే నైపుణ్యమున్నవారు నియమితులయ్యే అవకాశముంది.


అనుభవం లేని వారికి బాధ్యతలు

రోగులకు సంబంధించిన కేస్‌ షీట్లలో వివరాల నమోదు, డ్రగ్‌ స్టోర్‌, ల్యాబ్‌ నిర్వహణలోనూ లోపాలు వెలుగుచూస్తున్నాయి. అనుభవజ్ఞులను పక్కన పెట్టి కొత్తగా విధుల్లో చేరిన, తక్కువ వయసుగల నర్సింగ్‌ సిబ్బందికి ఫ్లోర్‌ ఇంఛార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వారికి అవగాహన లేకపోవడంతో తోటి సిబ్బందికి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ చెప్పినా ఎవరూ వినిపించుకోవట్లేదు. అనుభవమున్నవారికి బాధ్యతలు అప్పగిస్తే నిర్వహణ మెరుగు పడుతుందని తెలిసినా ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఇదే విషయమై ఇటీవల తనిఖీలకు వచ్చిన ఎన్‌ఏబీహెచ్‌ బృందం సైతం ప్రశ్నించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని