logo

పేటలో రోడ్డెక్కిన వైకాపా శ్రేణులు

పాయకరావుపేట వైకాపాలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. వర్గపోరు మరింత ముదిరింది.

Published : 28 Feb 2024 03:57 IST

పాయకరావుపేటలో వైకాపా కార్యకర్తల ఆందోళన

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేట వైకాపాలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. వర్గపోరు మరింత ముదిరింది. తాజాగా పేటకు చెందిన మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గూటూరు శ్రీనివాసరావు, ఎస్‌.రాయవరం మండలం దార్లపూడికి చెందిన పోలిశెట్టి పెద ఈశ్వరరావులపై అధిష్ఠానం వేటు వేసింది. శ్రీనివాసరావు సస్పెన్షన్‌పై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇన్నాళ్లూ పార్టీ బలోపేతానికి కృషిచేసిన వ్యక్తిని ఎలా సస్పెండ్‌ చేస్తారంటూ ఆందోళనకు దిగారు. మంగళవారం సాయంత్రం పెద్దఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పేటలో ర్యాలీ చేపట్టారు. మంగవరం రోడ్డు కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు నెలపర్తి అర్జున్‌ తదితరులు మాట్లాడుతూ పేట వైకాపా టికెట్‌ స్థానికులకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పేటలో ర్యాలీ చేశామని, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు హాజరయ్యారని చెప్పారు. తమ నేతపైనే కక్ష సాధింపునకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైకాపా నాయకులు కేశనకుర్తి సత్తిబాబు, వార్డుసభ్యుడు పల్లా ప్రసాద్‌, ఎం.శ్రీనివాసరావు, అశోక్‌. తాటిపాక లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని