logo

కట్టామా.. రిబ్బన్‌ కత్తిరించామా!!

అలల తీవ్రత, వంతెన కదలికలో మార్పులు, ప్రమాదకర పరిస్థితులను ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయి కసరత్తు పూర్తయ్యాక అనుమతివ్వటానికి మరికొద్ది రోజుల సమయం పట్టేలా ఉంది.

Updated : 29 Feb 2024 08:53 IST

అదే ముఖ్యమన్నట్టు వ్యవహరించిన వైకాపా నేతలు
ఇంకా సమగ్ర పరిశీలనలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి
పకడ్బందీ రక్షణ ఏర్పాట్లు ఏవీ?
ఈనాడు, విశాఖపట్నం'

అలల తీవ్రత, వంతెన కదలికలో మార్పులు, ప్రమాదకర పరిస్థితులను ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయి కసరత్తు పూర్తయ్యాక అనుమతివ్వటానికి మరికొద్ది రోజుల సమయం పట్టేలా ఉంది. అసలు అన్ని రకాలుగా సిద్ధం చేయకుండానే నేతలతో ఎందుకు ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభించారనే సమాచారం తెలిసి ఎంతో మంది వస్తున్నారు. అయితే ఇంకా సందర్శకులను అనుమతించడం లేదని, పరిశీలన జరుగుతోందనే సూచిక కనిపిస్తుండటంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు.

సురక్షితమేనా: ఫ్లోటింగ్‌ బ్రిడ్జి విశాఖ తీరంలో ఎంత వరకు సురక్షితమనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటివరకు ఈ తీరంలో ఈ రకమైన ఏర్పాటు చేయలేదు. అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరమైంది. ఇక్కడ అలల తాకిడి ఎక్కువ. ముఖ్యంగా ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనావేయలేమని జాతీయ సముద్ర పరిశోధన సంస్థ నిపుణులు పేర్కొంటున్నారు. గోవా, ముంబయి, కేరళలో అరేబియా సముద్రం మే, జూన్‌, జులై, ఆగస్టులో ప్రమాదకరంగా... మిగిలిన కాలం ప్రశాంతంగా ఉంటుంది. తూర్పు తీరం మాత్రం భీకర వాతావరణాన్ని కలిగుంటుం దంటున్నారు. సువిశాలమైన ఈ తీరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గాలులతో నిత్యం అలజడిగా ఉంటుంది. ఎప్పుడు తక్కువ తీవ్రత ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి.

భద్రత ఎలా?: సందర్శకుల అనుమతికి వీలుగా ఇక్కడ కంటైనర్‌తో కూడిన టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. పెద్దలకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.70 వసూలు చేసేలా ధరలు నిర్ణయించారు. వాతావరణ పరిస్థితుల అనుకూలత ఆధారంగా సందర్శకులకు అనుమతిస్తామని బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే.. సందర్శకుల భద్రతకు ఏంచేస్తారన్నది ఆసక్తిగా మారింది. మెరైన్‌ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని సమాచారం. వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసినవి అంత రక్షణాత్మకంగా లేకపోవడంతో అలల తీవ్రతకు కిందపడే ప్రమాదం లేకపోలేదు. సందర్శకుల వెంట ఈతగాళ్లను పంపుతామంటున్నా వెళ్లినందరికీ పంపించలేరు. ఇరువైపులా చెక్కలకున్న రంధ్రాల్లో చేతి వేళ్లు ఇరుక్కొని కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీయొచ్చంటున్నారు. వాటికి బదులు స్టీలువి ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇక్కడ అలలకు ఒక దిశ ఉండదు. దీంతో ఎటు నుంచైనా అవి రావొచ్చని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మొదటి రోజు

సందర్శనీయ స్థలం.. ఆటవిడుపు పరికరాలు.. సాహసక్రీడ.. ఇలా ఏదైనా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే సమగ్ర సన్నద్ధత అవసరం. ఎన్నో పరిశీలనలు, పరీక్షలు నిర్వహించిన మీదటే అనుమతించాలి. అలాంటివేవీ పూర్తిగా చేయకుండానే వైకాపా నేతలు, మంత్రులు తమ గొప్పతనం చాటుకునేందుకు ఆర్‌కే బీచ్‌లో ఆదివారం ఫ్లోటింగ్‌ బ్రిడ్జికి రిబ్బన్‌ కట్‌ చేశారు.


రెండో రోజు

సోమవారం అది విడిపోయిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా అని నెటిజన్లు ప్రశ్నించారు. అప్రమత్తమైన యంత్రాంగం
‘అది తెగలేదు... పరిశీలన నిమిత్తం లంగర్‌ వేశాం’ అని వెల్లడించింది. ఆ తరువాత పూర్తిగా పరిశీలించాకే అనుమతించాలన్న నిర్ణయానికి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని