logo

Rushikonda: రుషికొండపై జగన్నాటకం..!

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో రుషికొండ మీద నిర్మించిన రాజసౌధాన్ని ఎన్నికల ముందు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యాటకశాఖ ఇంతకుమునుపెన్నడూ ఖర్చు చేయని విధంగా ఈ ఒక్క చోటే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్‌ను నిర్మించారు.

Updated : 29 Feb 2024 09:06 IST

నిర్మాణాలకే రూ.450 కోట్ల ఖర్చు
సీఎం తాత్కాలిక వసతిగా గతంలో గుర్తింపు
ఆకస్మికంగా ప్రారంభానికి చర్యలు

మొదట ఒక పేరు.. ఆ తర్వాత మరో పేరు

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో రుషికొండ మీద నిర్మించిన రాజసౌధాన్ని ఎన్నికల ముందు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యాటకశాఖ ఇంతకుమునుపెన్నడూ ఖర్చు చేయని విధంగా ఈ ఒక్క చోటే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్‌ను నిర్మించారు.

ఈనాడు, విశాఖపట్నం: రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ రిసార్టు పేరుతో తీర ప్రాంత నియంత్రణ జోన్‌ (సీఆర్‌జడ్‌) అనుమతుల తీసుకున్న ఏపీటీడీసీ గురువారం పర్యాటకశాఖ మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభించనుంది. ఆది నుంచి అత్యంత వివాదాస్పదమైన ఈ ప్రాజెక్టును ఏవిధంగా కొనసాగిస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి అవసరాలకు వీలుగా నిర్మించిన భవనాలను అందుకోసమే ఉంచుతారా? మరే ఇతర అవసరాలకైనా వినియోగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం తాత్కాలిక వసతికి అనువుగా ఉంటుందని గతంలో గుర్తించడం గమనార్హం.

త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ‘రిసార్టు’ కోసమే ఈ  నిర్మాణాలనే భావన కలిగేలా ఆకస్మికంగా ప్రారంభిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తరువాత అధికార పార్టీలో కీలక నేతలకు లీజుకు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. మొదట ఈ ప్రాజెక్టుకు సంబంధించి ‘సమీకృత పర్యాటక సముదాయం’ పేరుతో 2021 జనవరిలో ఏపీటీడీసీ ఆసక్తి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రతిపాదనలు(ఆర్‌ఎఫ్‌పీ)ఆహ్వానించింది. 65 ఎకరాల్లో విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మించేలా రెండు దశల్లో రూ.230 కోట్లతో పనులు చేపట్టాలని పేర్కొంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఏడు నక్షత్రాల హోటల్‌ నిర్మిస్తున్నట్లు అప్పటి పర్యాటకశాఖ మంత్రి ఊదరకొట్టారు. ఆ తర్వాత 2021 జులైలో రిసార్టు పునరుద్ధరణ (రీడెవలప్‌మెంట్‌ ఆప్‌ రిసార్టు ఎట్‌ రుషికొండ) ప్రాజెక్టుగా మార్చి పనులు మొదలెట్టారు.

అనుమతులు ఒకలా.. పనులు మరోలా: పునరుద్ధరణ పనులకు ఏపీటీడీసీ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి 9.88 ఎకరాలకు తీర ప్రాంత జోన్‌ (సీఆర్‌జడ్‌) అనుమతి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం భవన నిర్మాణాల (బిల్డింగ్‌) ప్లాన్‌ కోసం 65 ఎకరాలకు అనుమతి కోరడం అప్పట్లో వివాదాస్పదమైంది. అనంతరం జీవీఎంసీకి సమర్పించిన ప్లాన్‌లోని భవనాలకు సంబంధించిన ఆకృతులు పర్యాటక వసతులకు వీలుగా లేవు. దాదాపు అన్ని నిర్మాణాల ఆకృతులు కార్యాలయాలను పోలి కనిపించాయి. ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. చివరిగా వేంగి, గజపతి, కళింగ, విజయనగరం బ్లాక్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

మొదటి నుంచి: రుషికొండను అక్రమంగా తవ్వేసిన తీరును మొదటి నుంచి పర్యావరణవేత్తలు తప్పుపట్టారు.  చివరికి హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో కేసులు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు సభ్యుల నిపుణుల కమిటీ రుషికొండ మీద సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు వాస్తవమేనని అప్పట్లో తేల్చింది. ఆ తర్వాత హైకోర్టు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్‌)ను పరిశీలనకు ఆదేశించింది. ఎంవోఈఎఫ్‌ సైతం నిపుణుల కమిటీతో పరిశీలించింది. దీనికి సంబంధించి తుది తీర్పు త్వరలో రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని