logo

‘ఆడ’తావెందుకన్నారు!!.. ఇప్పుడు వారే మెచ్చుకుంటున్నారు

క్రికెట్‌పై ఆసక్తితో బ్యాటర్‌గా అడుగుపెట్టి బౌలర్‌గా మారింది. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన తక్కువ సమయంలోనే ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకుంది.

Updated : 03 Mar 2024 08:26 IST

నాన్న కల సాకారమే ధ్యేయం
క్రికెటర్‌ షబ్నమ్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం : క్రికెట్‌పై ఆసక్తితో బ్యాటర్‌గా అడుగుపెట్టి బౌలర్‌గా మారింది. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన తక్కువ సమయంలోనే ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకుంది. పదిహేనేళ్లకే మహిళా ప్రీమియర్‌ లీగ్‌  (డబ్ల్యూపీఎల్‌)లోనూ అవకాశం దక్కించుకుంది. నాన్న కలనే.. తన కలగా చేసుకుని ముందుకు సాగుతోంది విశాఖకు చెందిన పదహారేళ్ల షబ్నమ్‌. తన విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే.

6 నుంచి 8 గంటల సాధన..

అమ్మ ఈశ్వరమ్మ, నాన్న ఎండీ షకీల్‌ నేవీలో పనిచేస్తుంటారు. నాన్న క్రికెటర్‌. నేనూ ఆడతానని చెప్పడంతో ఎనిమిదేళ్లకే అకాడమీలో చేర్చారు. అప్పట్లో సదుపాయాలు లేకపోవడంతో దేశం తరఫున ఆడలేకపోయానని నాన్న ఇప్పటికీ చెబుతుంటారు. చెల్లి షాజహాన్‌ క్రికెటరే. అండర్‌-15 ఆడుతోంది. 11 ఏళ్ల వయసులో ప్రాక్టీస్‌లో భాగంగా కిందపడ్డా. గంట పాటు స్పృహలేదు. సమస్య లేదని వైద్యులు చెప్పడంతో అమ్మ, నాన్న ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల తర్వాత యథావిధిగా ప్రాక్టీస్‌కు వెళ్లిపోయా. ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ఉదయం 04.30కే శిక్షణ ప్రారంభిస్తా. ప్రాక్టీస్‌ కోసం సాయంత్రం పీఎం పాలెంలోని క్రికెట్‌ మైదానానికి వెళ్తా. మ్యాచ్‌లుంటే రోజుకు 6 నుంచి 8 గంటలు సాధన చేస్తా. ఒక్కోసారి బస్సులు, ఆటోలు దొరక్క ఇంటికొచ్చేసరికి ఆలస్యమయ్యేది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నా.

జాతీయజట్టులో చోటు..

2021లో ఏపీ జట్టుకు, తర్వాత ఏడాదిలోనే ఇండియా-బి జట్టుకు ఎంపికయ్యా. గతేడాది అండర్‌-19 ప్రపంచ కప్‌లో జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించా. డబ్ల్యూపీఎల్‌-1 సమయంలో గుజరాత్‌ గెయింట్స్‌ వేలంలో రూ.10 లక్షలకు దక్కించుకుంది. ఇటీవల ప్రారంభమైన రెండో సీజన్‌కు గత జట్టులో 18 మందికి గాను ఏడుగురిని మాత్రమే రిటైన్‌ చేసుకోగా.. నేనొకదాన్ని. తక్కువ వయసులో డబ్ల్యూపీఎల్‌కు ఎంపికైనవారిలో ఉన్నా. ఇటీవల సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికయ్యా.

మరికొందరికి ప్రేరణగా..

క్రికెట్‌ నేర్చుకుంటానంటే ‘ఆడపిల్లకు ఆటలెందుకని’ బంధువులు అనేవారు. ‘ఆడపిల్లలు.. అబ్బాయిల కంటే ఎందులోనూ తక్కువ కాదని’ నాన్న బదులిచ్చేవారు. మొదట్లో వ్యతిరేకించిన బంధువులు.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. నన్ను చూసి మరికొంతమంది అమ్మాయిలకు క్రికెట్‌ నేర్పిస్తున్నారు. మెలకువలు, శిక్షణ వివరాలు చెప్పాలని అడుగుతున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా.  భారత మహిళా క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌గా నిలిచిపోవాలన్నది లక్ష్యం. భవిష్యత్తులో ఐఏఎస్‌ అధికారి కావాలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని