logo

పింఛన్ల పంపిణీలో వైకాపా దొంగాట

సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా బరి తెగిస్తుందనడానికి సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారమే ఉదాహరణ అంటూ విపక్షపార్టీలు మండిపడుతున్నాయి.

Updated : 02 Apr 2024 10:02 IST

గత ఎన్నికల్లోనూ వారం ఆలస్యం
ఇప్పుడేదో అయిపోతోందని గగ్గోలు
ప్రతిపక్షాలపై బురదజల్లే కుట్ర
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా బరి తెగిస్తుందనడానికి సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారమే ఉదాహరణ అంటూ విపక్షపార్టీలు మండిపడుతున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీలో జాప్యం చేసి దాన్ని తెదేపాపై తోసేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని వైకాపా ఎత్తుగడ వేసింది. దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏటా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మరుసటి రోజున బ్యాంకులకు సెలవు ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వం నిర్వహణ పేరుతో సీఎంఎస్‌ఎఫ్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తుంది. తద్వారా ఏటా ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతుంది. ఈ ఏడాది మార్చి 30, 31 తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు ఉండవు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసినా ముందు చూపుతో వ్యవహరించలేదు. ఫలితంగా పింఛన్ల పంపిణీ ఒకటి, రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయవచ్చు..

జిల్లాలో 607 గ్రామ/వార్డు సచివాయాలున్నాయి. వీటిలో దాదాపు 4200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 300 మంది లబ్ధిదారులు ఉంటారు. అంటే ఒక్కో ఉద్యోగి 30 మందికి పింఛన్లు ఇస్తే సరిపోతుంది. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయకుండా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినందున ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీ చేపడతామని, లబ్ధిదారులు ఆధార్‌కార్డు తీసుకుని సచివాలయానికి రావాలంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వృద్ధులు వడదెబ్బ బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారనే అంశం తెరపైకి వస్తోంది.

2019 ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్థితి

విశాఖ జిల్లాలో 1,65,801 మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. నగర పరిధిలో 1,38,231 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 27,570 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు పింఛన్లు అందజేసేవారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో పింఛనుదారులకు  నగదు ఎలా అందించాలనే అంశంపై సమాలోచనలు సాగుతున్నాయి. ఈ కారణంగా పింఛన్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి తెదేపా కారణమని వైకాపా విష ప్రచారం చేస్తోంది. అయితే 2019 ఎన్నికల సమయంలోనూ వారం రోజులు ఆలస్యంగా లబ్ధిదారులకు పింఛన్లు అందిన విషయాన్ని తెదేపా గుర్తు చేస్తోంది.

చరవాణులు, బయోమెట్రిక్‌ పరికరాలు స్వాధీనం

జిల్లాలో దాదాపు 10వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం అందజేసిన చరవాణులు, బయోమెట్రిక్‌ యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వాలంటీర్లు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల్లో తలదూర్చకూడదు. ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలి. అయితే వీరిని ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. లేకుంటే వైకాపా అనుకూలంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని