logo

అటకెక్కిన ఆధునికీకరణ

రైవాడ కుడి, ఎడమ కాలువల్లో 11 రెగ్యులేటర్లు, 19 స్లూయిస్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంది. 5 అక్విడెక్ట్‌లు, 13 కల్వర్టులు నిర్మించడంతో పాటు స్పిల్‌వే, యాప్రాన్‌ మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు.

Published : 03 Apr 2024 03:32 IST

కదలని రైవాడ కాలువ లైనింగ్‌ పనులు

రైవాడ కాలువలో నిర్మించిన సిమెంట్‌ లైనింగ్‌ పగిలిపోయిందిలా..

రైవాడ కుడి, ఎడమ కాలువల్లో 11 రెగ్యులేటర్లు, 19 స్లూయిస్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంది. 5 అక్విడెక్ట్‌లు, 13 కల్వర్టులు నిర్మించడంతో పాటు స్పిల్‌వే, యాప్రాన్‌ మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. 9.643 కి.మీ సిమెంట్‌ లైనింగ్‌ కూడా వేయాలి. ఇవేవీ జరగలేదు.

ఈనాడు, అనకాపల్లి: జిల్లాలో జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ ఏజెన్సీ (జైకా) నిధులతో చేపడుతున్న రైవాడ జలాశయం కాలువల ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. అరకొరగా చేసిన పనులు కూడా రూపురేఖలు మారిపోయాయి.. కొన్నేళ్లుగా ప్రతిపాదనల్లోనే మగ్గిన ఈ పనులను 2021లో కార్యరూపంలోకి తీసుకువచ్చారు. రూ.26.46 కోట్ల అంచనాతో కాలువలో సిమెంట్‌ లైనింగ్‌, ఇతర నిర్మాణాలు ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. సుమారు రూ.4 కోట్ల మేర పనులు చేసిన తర్వాత బిల్లులు అందకపోవడంతో అసంపూర్తిగానే వదిలేశారు. నెలలు దాటి సంవత్సరాలు గడుస్తున్నా సొమ్ములందే పరిస్థితి లేకపోవడంతో గుత్తేదారు మూటముల్లె సర్దుకుని వెళ్లిపోయారు. దీంతో రైవాడ ఆధునికీకరణ అసంపూర్తిగానే ఆగిపోయింది. నిధుల సమస్యను పరిష్కరించి సాగునీటి భరోసా కల్పించాల్సిన స్థానిక మంత్రి బూడి ముత్యాలనాయుడు రైవాడను వదిలేసి, పెద్దేరును ఉద్ధరిస్తానని ఇటీవల శిలాఫలకం వేశారు. ఆ ప్రాజెక్టుకు సర్కారు సొమ్ములివ్వకపోయినా ఎన్నికల ముందు హడావిడి చేశారు.

దేవరాపల్లి, కె.కోటపాడు, చోడవరం మండలాల్లో 15,344 ఎకరాలకు సాగునీటితో పాటు విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రోజూ 50 క్యూసెక్కుల నీటిని రైవాడ నుంచే సరఫరా చేస్తుంటారు. ఈ జలాశాయనికి కుడి, ఎడమ ప్రధాన కాలువలు సుమారు 68 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో కేవలం 18 కి.మీ మాత్రమే గతంలో సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేశారు. మిగతా అంతా మట్టి కాలువే. ఇందులోనే జైకా నిధులతో ఎడమ ప్రధాన కాలువలో 12 కి.మీ, కుడి ప్రధాన కాలువలో 2 కి.మీ మేర లైనింగ్‌ పనులు చేసి గట్లను పటిష్ఠపరచాలనుకున్నారు. నిధుల్లేక పనులు పడకేయడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు.

ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి..

ఆయకట్టులో శివారు భూములకు ఎప్పుడూ రైవాడ నుంచి సాగునీరందడం లేదు. మట్టి కాలువలు కావడంతో లీకేజీ సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోతున్నారు. జైకా సాయంతో కాలువ ఆధునికీకరణ మొదలుపెట్టారు ఇక సాగునీటి బెంగతీరినట్లే అనుకున్నారు. వారి ఆశలు పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే ఆవిరైపోయాయి. గుత్తేదారు 2022 జనవరి నాటికి రైవాడ ఆధునికీకరణ పూర్తి చేయాల్సి ఉంది. గడువు సమయానికి పనిలో కేవలం 17 శాతం మాత్రమే చేశారు. బిల్లుల సమస్య కారణంగా ఈ పనుల్లో జాప్యం చేస్తూ వచ్చారు. ఈలోగా గుత్తేదారుకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. మరలా మొదలు పెట్టాలంటే నిర్మాణ గడువును (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ టైమ్‌) పెంచాల్సి ఉంది. ఈ ఏడాది వరకు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పట్లో రైవాడ పనులు మరలా పట్టాలెక్కడం కష్టమేనని జలవనరుల శాఖ అధికారి ఒకరు చెప్పారు. గడువులోగా చేసిన ఆ కొద్ది పనులు కూడా చెదిరిపోయాయి. అసంపూర్తి పనులకు తోడు ఖరీఫ్‌ సీజన్‌లో వాటి మీదుగానే నీటిని విడిచిపెట్టడంతో అడుగున వేసిన కాంక్రీట్ అంతా తేలిపోయింది. కాలువకు రెండువైపు గట్లు కోతకు గురై బలహీనపడ్డాయి. నీరు వదిలినప్పుడు పైకి బాగా కనిపిస్తున్నా.. అడుగు భాగమంతా అధ్వానంగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని