logo

ఎక్కడున్నారో.. ఏమయ్యారో.. విశాఖలో గాలిస్తున్న కోస్టుగార్డు నౌకలు, హెలికాప్టర్‌

విశాఖ చేపలరేవు నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు దిటవు చేసుకుని తమవారి కోసం తీరంలో ఎదురు చూస్తున్నారు.

Updated : 03 Apr 2024 07:23 IST

తీవ్ర ఆందోళనలో బాధిత కుటుంబాలు

విశాఖ చేపలరేవు నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు దిటవు చేసుకుని తమవారి కోసం తీరంలో ఎదురు చూస్తున్నారు.

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌: పదవాల శ్రీనివాసరావుకు చెందిన ఫైబరు బోటు (ఐఎన్‌డీ-ఏపీ-వీ1-ఎంక్యూ-2736)లో కారి చిన్నారావు (45), కారి నరేంద్ర(18), మైలపల్లి మహేష్‌ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చినసత్తెయ్య (55), వాసుపల్లి పొడుగు అప్పన్న(32) సోమవారం మధ్యాహ్నం వేటకు బయలుదేరారు. బోటు గంగవరం వైపు వెళ్లి అక్కడి నుంచి డీప్‌సీలో వేట ప్రారంభించింది. సోమవారం రాత్రి 10గంటల తర్వాత బోటులోని మత్స్యకారులు ఫోన్లో మాట్లాడారు. తదుపరి ఫోన్లు పనిచేయలేదు. మంగళవారం ఉదయానికి బోటు చేపలరేవుకు చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం వరకు రాలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జేడీ విజయకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కోస్టుగార్డు, నౌకాదళ అధికారులకు సమచారం అందించారు. ఈ మేరకు కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్‌ గల్లంతైన బోటు కోసం గాలిస్తున్నాయని మత్స్యశాఖ జేడీ విజయృష్ణ తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.

అధికారులు పట్టించుకోరా?: మరోవైపు ఉదయం నుంచి బోటు గల్లంతైన విషయం చెబుతున్నా మత్స్యశాఖ అధికారులు పట్టించుకోలేదని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకరు గల్లంతైనా హడావుడి చేసేవారని, ఇప్పుడు ఆరుగురు గల్లంతైనా సకాలంలో స్పందించకపోవడం దారుణమన్నారు. గల్లంతైన వారిలో కారి చిన్నారావు, కారి నరేంద్ర తండ్రీ కొడుకులు. మిగిలిన వారు సైతం సమీప బంధువులే. విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కం గ్రామానికి చెందిన వీరు పొట్టకూటి కోసం విశాఖ వచ్చి చేపలవేట సాగిస్తూ జీవనం పొందుతున్నారు. చేపలరేవు సమీపంలోని జాలారిపేటలో నివాసం ఉంటున్నారు.

  • విశాఖ ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ మంగళవారం సాయంత్రం చేపలరేవుకు చేరుకున్నారు. మత్స్యశాఖ అధికారులు, బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. నౌకాదళ అధికారులతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేస్తామని, ఘటనకు సంబంధించిన అంశాలను కలెక్టర్‌, ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని