logo

దందాల ‘బాణం’...ఉక్కిరిబిక్కిరిలో జనం!!

ఆ కార్పొరేటర్‌ చూపు ‘బాణం’ కంటే వేగమైంది. ఇంకేముంది జీవీఎంసీలో తనకు దక్కిన పదవిని అడ్డుపెట్టుకొని అక్రమాల పర్వానికి తెరలేపారు. ఉత్తరం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ... ఎలా వీలైతే అలా కాసుల వేట సాగించారు.

Updated : 03 Apr 2024 04:19 IST

‘ఉత్తరం’లో వైకాపా నేత అక్రమాలు
కీలక పదవి అడ్డుపెట్టుకుని కమీషన్ల వసూళ్లు

షాదీఖానా

ఆ కార్పొరేటర్‌ చూపు ‘బాణం’ కంటే వేగమైంది. ఇంకేముంది జీవీఎంసీలో తనకు దక్కిన పదవిని అడ్డుపెట్టుకొని అక్రమాల పర్వానికి తెరలేపారు. ఉత్తరం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ... ఎలా వీలైతే అలా కాసుల వేట సాగించారు. అధికారం అండతో జీవీఎంసీలో వ్యవస్థలన్నింటినీ దాసోహం చేసుకుని జేబులు నింపేసుకుంటున్న సదరు నేత తీరుతో ఎంతో మంది అడిగినంత సమర్పించుకోక తప్పడం లేదు.

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, అక్కయ్యపాలెం

బకాయిలు తగ్గించేసి..

వాణిజ్య సముదాయాలు, మార్కెట్ల బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం, అవినీతిని గుర్తించిన నాటి జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన రెవెన్యూ అధికారులతో సమీక్షించి నోటీసులు జారీ చేశారు. మొత్తం 905 దుకాణాలు, మార్కెట్లకు సంబంధించి రూ.50 కోట్లకుపైగా ఆదాయం రావాలని నిర్ధారించారు. బకాయిలపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం వసూళ్లకు సిద్ధమయ్యారు. ఇంకేముంది? ఓ ‘బాణం’ ఇక్కడ సంధించారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ప్రత్యేకంగా ఐదుగురితో కమిటీని నియమించగా.. అందులో ఉన్న ఈ నేత చక్రం తిప్పారు. పాతనగరంలోని ఫ్రూట మార్కెట, జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట నుంచి రావాల్సిన రూ. కోట్ల బకాయిలను రూ. లక్షల్లోకి తెచ్చి కొందరి నుంచి కమీషన్ల రూపంలో భారీగా లబ్ధిపొందారనే విమర్శలు వెల్లువెత్తాయి.

భారీగా అద్దె వసూళ్లు: అక్కయ్యపాలెంలోని జీవీఎంసీ షాదీఖానాను మూడేళ్ల లీజుకు ఒక అనుచరునికి కట్టబెట్టారు. శుభకార్యాలకు రూ.60వేలు అద్దె.. మరో రూ.40వేలు విద్యుద్దీపాలంకరణ, షామియానాకు అంటూ రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి భవనానికి సంబంధించిన అద్దె మాత్రమే గుత్తేదారులు వసూలు చేయాలి. మిగతా అలంకరణ, ఆహార పదార్థాల తయారీ వంటివి అద్దెకు తీసుకున్నవారి ఇష్ట ప్రకారం బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం గుత్తేదారు చెప్పినవారి వద్దే  తీసుకోవాలంట. వేలం వేయక ముందు జీవీఎంసీ ఆధీనంలో ఉన్నప్పుడు రూ.8 వేలు ఉండే అద్దె.. ఆ తరువాత భారీగా పెరిగిపోయింది.

కోళ్ల వ్యర్థాల్లోనూ...: కోళ్ల వ్యర్థాల్లోనూ కాసుల వేట సాగిస్తున్నారు. నగరంలోని చికెన్‌ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించడానికి జీవీఎంసీ కొన్ని వ్యాన్లను ఏర్పాటు చేసింది. వ్యర్థాలను అక్కయ్యపాలెం 80 అడుగులరోడ్డు కె.వి.పాఠశాల వద్ద వేరు చేసి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుకు ఆహారంగా పంపిస్తున్నారు. ఇలా కోళ్ల వ్యర్థాలతో చేపలు పెంచడం, వ్యర్థాలు రవాణా చేయడం రెండూ చట్ట విరుద్ధమే. అయినా ఈ కోళ్ల వ్యర్థాల రవాణాతో రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. జీవీఎంసీలో కీలక ప్రజాప్రతినిధి మేనల్లుడితోకలిసి భాగస్వామ్యంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.

సిబ్బంది నియామకాల్లో చక్రం తిప్పి: నగరంలో చెత్త తరలించే గుత్తను రాష్ట్రస్థాయిలో అప్పగించారు. అయితే.. అదనపు వాహనాల్లో చెత్తను తరలించాలనే ప్రతిపాదన మళ్లీ స్థాయీ సంఘంలో ప్రతిపాదించడంలో కీలకంగా వ్యవహరించిన ఈ నేత కమీషన్లు పొందుతున్నారు. జీవీఎంసీˆలో కొత్తగా కూలి ప్రాతిపదికన కార్మికులను ఏర్పాటు చేయిస్తున్నట్లు ప్రతి స్థాయీ సమావేశంలో అనుమతులు పొందుతున్నారు. ఇప్పటికి 600 మంది పారిశుద్ధ్య కార్మికులను పేరుకు నియమించి... పనిచేయకుండానే ఆ సొమ్ములు తన జేబులోకి వచ్చేలా చేసుకున్నారన్న విమర్శలున్నాయి.

నిర్మాణదారులకు దడే: నగరంలో కొన్ని అనధికార నిర్మాణాలకు ఆయన కుటుంబ సభ్యులే గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో దర్జాగా ఓ నిర్మాణం చేపట్టగా..అధికారులు చర్యలు తీసుకోకుండా కథ నడిపారనే ఆరోపణలున్నాయి. నందగిరినగర్‌లోని నిబంధనలకు విరుద్ధంగా నూతనంగా జి+3 భవనాన్ని నిర్మిస్తున్నారు. పోర్టు ఆసుపత్రి ఎదురుగా జాతీయ రహదారి ఆనుకుని జరుగుతున్న ఓ భవన నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతుల్లేకపోయినా రూ. లక్షలు వసూలు చేసి అధికారులెవ్వరూ అటువెపు వెళ్లకుండా కట్టడిచేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ పెద్దల్లో కొందరికి ఇవ్వాలంటూ నగరంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి కూడా భారీగానే గుంజేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు