logo

తప్పుకొంటే తప్పు చేసినట్లే..!

డిగ్రీ, పీజీ, ఎంబీఏ పూర్తిచేసిన ఉన్నత విద్యావంతులకు వాలంటీర్ల ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో ఎదుగుదల లేకుండా చేసిన జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతపు రాజీనామాలు చేయిస్తోంది.

Published : 13 Apr 2024 03:46 IST

34 ఏళ్ల నిబంధన దాచిపెడుతున్న వైకాపా నాయకులు
వాలంటీర్లను మోసగిస్తూ రాజీనామాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: డిగ్రీ, పీజీ, ఎంబీఏ పూర్తిచేసిన ఉన్నత విద్యావంతులకు వాలంటీర్ల ఉద్యోగాలు అందించి వారి జీవితాల్లో ఎదుగుదల లేకుండా చేసిన జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు వారి ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతపు రాజీనామాలు చేయిస్తోంది. మడుతూరు, ఎం.జగన్నాథపురం గ్రామాలకు చెందిన వాలంటీర్లు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం పరిపాలన అధికారి కృష్ణను కలిసి రాజీనామా పత్రాలను అందించారు. ఎం.జగన్నాథపురం నుంచి చంటి పిల్లల తల్లులను సైతం వైకాపా నాయకులు అచ్యుతాపురం ఎంపీడీఓ కార్యాలయానికి రప్పించి రాజీనామా చేయించారు. ఇప్పుడు రాజీనామా చేసిన వారిని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని రాజీనామా చేయకుంటే తరవాత అవకాశం ఇవ్వమని, బెదిరిస్తున్నారని క్షేత్రస్థాయిలో కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వాలంటీర్లుగా నియమించాలంటే వైకాపా ప్రభుత్వం 18 నుంచి 34 ఏళ్లలోపు వయస్సు ఉండాలని నియామక ప్రకటనలో తెలిపింది. ఒకసారి నియమించిన వారిని 35 ఏళ్లు దాటినా తొలగించడానికి వీలుకాదు. ఈ నిబంధనను పక్కనపెట్టి ప్రస్తుతం 35 ఏళ్లు వచ్చిన వారిని సైతం వైకాపా నాయకులు వారి రాజకీయ అవసరాల కోసం బలవంతంగా రాజీనామా చేయిస్తూ పార్టీ ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే మళ్లీ తమను తిరిగి నియమించే అవకాశం ఉందని భావించి వాలంటీర్లు సైతం అమాయకంగా రాజీనామా చేస్తున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో 35 ఏళ్లు దాటిన వారిని ఇప్పటికే వైకాపా నాయకులు రాజీనామా చేయించారు. ఎన్నికల సమయంలో నిజాయతీగా వ్యవహరించాల్సిన ఉన్నత విద్యావంతులైన వాలంటీర్లు రాజీనామా చేయడం ద్వారా ఉద్యోగం కోల్పోవడంతో పాటు వైకాపా వారిగా ముద్రడే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని