logo

సొంతింటి కల.. మిగిలింది కలత

తెదేపా హయాంలో ఎన్‌టీఆర్‌ రూరల్‌, పీఎంఏవై -ఎన్టీఆర్‌ గ్రామీణ, అర్భన్‌ పేర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1.15 లక్షల ఇళ్లు మంజూరు...

Published : 13 Apr 2024 04:11 IST

ఇళ్ల నిర్మాణానికి రూపాయి సాయం ఇవ్వని ప్రభుత్వం
పేదోడి గూడు అంటే జగనన్నకు చిన్నచూపే
తెదేపా హయాంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ
ఈనాడు, పాడేరు, న్యూస్‌టుడే, బృందం

నాడు..: తెదేపా హయాంలో ఎన్‌టీఆర్‌ రూరల్‌, పీఎంఏవై -ఎన్టీఆర్‌ గ్రామీణ, అర్భన్‌ పేర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1.15 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. గ్రామీణ్‌ పథకంలో లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 52 వేల రాయితీతో కలిపి రూ. 2 లక్షలు యూనిట్‌ విలువగా ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పీవీటీజీలకు మరో రూ.లక్ష,  షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజనులకు రూ.75 వేలు, మైదాన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 50 వేల చొప్పున యూనిట్‌ విలువకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. అదేవిధంగా ఎన్టీఆర్‌ అర్భన్‌ బీఎల్‌సీ పథకంలో రూ.లక్ష రాయితీ ఇచ్చి బ్యాంకులోన్‌ కలిపి రూ. 2.75 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేవారు. అప్పటి ధరలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయానికి పెద్దగా తేడా ఉండేది కాదు. ఎంతో కొంత అదనంగా వేసి మంచి ఇంటిని నిర్మించుకునేవారు.

నేడు..: వైకాపా సర్కారు కొలువు తీరిన రెండున్నరేళ్ల వరకు ఇళ్ల నిర్మాణం వైపే చూడలేదు. తర్వాత పేదలందరికీ ఇళ్ల పథకం పేరుతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 72 వేల ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయంగా రూ. 1.8 లక్షలు ఇస్తున్నారు. ఈ మొత్తంలో కేంద్రం ప్రభుత్వం రూ. 1.5 లక్షలు ఇస్తే మిగతా రూ. 30 వేలు ఉపాధిహామీ పథకం ద్వారా చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. పైగా నిర్మాణ సామగ్రి పేరుతో ఇనుప ద్వారబంధాలు, కిటికీ ఫ్రేమ్‌లు, రంగులు, వైరింగ్‌ సామగ్రి అంటగలిపి ఇచ్చే అరకొర సొమ్ములో కొంత కోతపెడుతున్నారు. జగనన్న కాలనీల్లో ఇంటి కోసం ఇస్తున్న రూ. 1.8 లక్షలు పునాదులు తీయడానికి కూడా సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


ధరల పిడుగు..

సుక నుంచి సిమెంటు, పిక్క, ఇనుము వరకు అన్నింటా పెరుగుతున్న ధరలు చూసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రభుత్వం రూ. 1.8 లక్షలు ఇస్తున్నా ఇప్పుడున్న ధరల ప్రకారం సెంటున్నరలో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఖర్చవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇసుక ఉచితమంటూనే రవాణాభారం నెత్తిన వేస్తున్నారు. అదనంగా సిమెంటు సరఫరా చేస్తామని చెప్పినా అమలు చేయడం లేదు. సిమెంట్‌ బస్తా నేడు రూ. 420 పలుకుతోంది. ఇనుము సక్రమంగా సరఫరా చేయడం లేదు.. భవన నిర్మాణ కార్మికుల కూలి రేట్లు పెరగడంతో ఇంటి బడ్జెట్‌ ఊహించనంత పెరిగిపోతోంది. దీంతో కొంతమంది పునాదులు, లింటల్‌ స్థాయి వరకు నిర్మించి వదిలేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని