logo

పాలన ఘోరం... ఫలితాలు దారుణం!!

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వానికి జిల్లాలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థపై లేకపోయింది.

Updated : 13 Apr 2024 04:57 IST

ప్రభుత్వ కళాశాలలపై దృష్టిసారించని వైకాపా ప్రభుత్వం
‘ఇంటర్‌’లో ఉత్తీర్ణతా తీరే రుజువు
న్యూస్‌టుడే, మద్దిలపాలెం

‘నా’..అంటూ పేదల గురించి గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్‌... ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే పేద పిల్లలపై దృష్టిసారించలేదు. ఆ ఫలితమే... శుక్రవారం బయటపడింది.

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వానికి జిల్లాలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థపై లేకపోయింది. విడుదలైన ఇంటర్‌ ఫలితాలు చూస్తే ప్రభుత్వ కళాశాలల్లో వసతులు, బోధన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటూ సీఎం జగన్‌ గత అయిదేళ్లుగా ఊదరగొడుతున్నారు. కానీ, కళాశాలల్లో సదుపాయాల మెరుగుపరచడంపై దృష్టి పెట్టలేదు. ఆనందపురం కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 19 మంది పరీక్షలు రాస్తే ఇద్దరే పాసయ్యారు. అయిదేళ్లుగా జిల్లాలోని కళాశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది.

కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే..: సాధారణ కోర్సులకు సంబంధించి జిల్లాలో 197 మంది అధ్యాపకులున్నారు. వారిలో శాశ్వత అధ్యాపకులు 71 మంది మాత్రమే. కాంట్రాక్టు అధ్యాపకులు 70, అతిథి అధ్యాపకులు 56 మంది ఉన్నారు. శాశ్వత అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. వైకాపా హయాంలో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులకు సమయానికి జీతాలు ఇచ్చిన దాఖలాల్లేవు. ఒక్కోసారి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. అతిథి అధ్యాపకులకు మరోచోట మెరుగైన అవకాశం వస్తే వెళ్లిపోతున్నారు. ఈ ప్రభావం బోధనపై పడింది. కొన్ని కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ జరిగినా.. నియామకాలు చేపట్టలేదు.దీంతో సరైన బోధన సాగలేదు.

పుస్తకాలేవి: తెదేపా హయాంలో ఇంటర్‌ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పుస్తకాల పంపిణీ జరిగేది. వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. మూడేళ్లుగా విద్యార్థులకు పుస్తకాల సరఫరా నిలిచిపోయింది. దీంతో చదువు పూర్తయి వెళ్లిపోయే విద్యార్థుల నుంచి పుస్తకాలు తీసుకొని కొంత మందికి సర్దుతున్నారు.

ఏటా ఇంటర్‌ ప్రవేశాలు జూన్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు జరుగుతున్నాయి. డిసెంబరు చివరి నాటికి సిలబస్‌ పూర్తికావాల్సి ఉన్నా.. అలా జరగలేదు. నాడు-నేడు పనులు వేసవి సెలవుల్లో పూర్తిచేయాలి. కానీ జూన్‌ నుంచి ఇప్పటివరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటివల్ల విద్యార్థుల బోధనకు ఆటంకం కలుగుతోంది.

‘హైస్కూల్‌ ప్లస్‌’లో అధ్వానం: ‘హైస్కూల్‌ ప్లస్‌’లో ఫలితాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం జిల్లాలోని ఆరు పాఠశాలల్లో ‘హైస్కూల్‌ ప్లస్‌’ను ప్రవేశపెట్టారు. నూతన విద్యా విధానం ప్రకారం ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టారు. గదులు కేటాయించడం తప్ప అక్కడ ఇంటర్‌ విద్యకు అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. కొన్నిచోట్ల పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్‌ ఉపాధ్యాయులతో ఇంటర్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పించారు. జూనియర్‌ అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదు. ఇంటర్‌ తొలి ఏడాదిలో మొత్తం 167 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 25 మంది (20.3 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గంగవరం పాఠశాలలో 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగిలిన ఏ పాఠశాలలోనూ ఉత్తీర్ణత 20 శాతం కూడా దాటలేదు. రాంపురం పాఠశాల నుంచి 20 మంది పరీక్షలు రాస్తే ఒక్కరే పాసయ్యారు. 111 మంది ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు రాయగా 22 మంది (21.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సీతమ్మధార పాఠశాల (35.7) మినహా ఏ పాఠశాలలోనూ ఉత్తీర్ణత 30 శాతం దాటలేదు.

ఎందుకీ పరిస్థితంటే...

  • తగినంత మంది బోధకుల నియామకం జరగకపోవడం
  • పుస్తకాల సరఫరా లేకపోవడం
  • ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలందకపోవడం
  • ప్రజాప్రతినిధులు, యంత్రాంగం దృష్టిసారించకపోవడం
  • సిలబస్‌ సకాలంలో పూర్తికాకపోవడం
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని