logo

ఐదేళ్లు కనికట్టు.. విశాఖ తాకట్టు!

జగన్‌ పాలనంటే...విశాఖలో కొండలు వణికిపోతున్నాయి... బోడిగుండులా మార్చేశారని! ఆస్తులు కన్నీళ్లు పెడుతున్నాయ్‌... తాకట్టులోకి వెళ్లిపోయామని! జనం మండిపడుతున్నారు... ఈ పన్నుల బాదుడేంటని! శిలాఫలకాలు నవ్వుతున్నాయ్‌...

Updated : 21 Apr 2024 06:07 IST

నగరంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులేవీ?
భారీ హడావుడితో శంకుస్థాపనలు
తరువాత కీలక ప్రాజెక్టులన్నీ మూలకే
నేడు బస్సు యాత్రలో జనం ముందుకు జగన్‌

జగన్‌ పాలనంటే...విశాఖలో కొండలు వణికిపోతున్నాయి... బోడిగుండులా మార్చేశారని! ఆస్తులు కన్నీళ్లు పెడుతున్నాయ్‌... తాకట్టులోకి వెళ్లిపోయామని! జనం మండిపడుతున్నారు... ఈ పన్నుల బాదుడేంటని! శిలాఫలకాలు నవ్వుతున్నాయ్‌... ప్రారంభోత్సవాలుండవా అని! భూములు భయపడుతున్నాయ్‌... కబ్జాలకు అంతెక్కడుందని! అభివృధ్ధి... ఉద్యోగాలు.. పరిశ్రమలు... ఇలాంటివన్నీ మాయమైపోతున్నాయని వైకాపా ప్రభుత్వం హయాంలో తమకు చోటెక్కడుందని!!

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ నగరాన్ని అభివృద్ధిలో ఎక్కడికో తీసుకువెళతా అంటూ జగన్‌ ఐదేళ్లు కల్లబొల్లిమాటలతో గడిపేశారు. అభివృద్ధి పక్కనపెట్టి విధ్వంసాలకు నిలయంగా  మార్చారు. భూకబ్జాలతో విలువైన ఆస్తులను కొల్లగొట్టారు. గంజాయి రవాణాను నియంత్రించలేక అరాచకాలకు అడ్డాగా నిలిపారు. ‘నా విశాఖ..నా విశాఖ’ అంటూ ప్రజలకు శోకమే మిగిల్చారు. జనంపై చెత్త, ఆస్తి పన్ను భారం భారీగా మోపారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి, చేసిన శంకుస్థాపనలు ఎక్కడగొంగళి అక్కడే అన్న చందంలా మార్చేసిన జగన్‌... మళ్లీ ప్రజలను వంచించేందుకు ‘సిద్ధం’ అంటూ ఆదివారం ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.

ఎన్‌ఏడీ వద్ద పూర్తికాని ఆర్‌వోబీ

తాకట్టు డబ్బుతో విశాఖకు ఏం చేశారు?

విశాఖను జగన్‌ ఒక బంగారు బాతులానే చూశారు. అధికారంలోకి వచ్చీరాగానే విశాఖలో విలువైన ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. గోపాలపట్నం రైతు బజారు, కప్పరాడలోని ఐఐటీ, పాలిటెక్నిక్‌, రేసవువానిపాలెంలోని రెవెన్యూ క్వార్టర్స్‌, చినగదిలిలో డెయిరీఫారమ్‌, సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయం, బక్కన్నపాలెం సెరీకల్చర్‌, స్త్రీశిశు సంక్షేమ భవన్‌, కిర్లంపూడి లేఅవుట్‌లోని పోలీస్‌ క్వార్టర్స్‌, ఇరిగేషన్‌ ఈఈ బంగ్లా, కార్యాలయం, సీఈ బంగ్లా, సర్క్యూట్‌హౌస్‌...ఇలా ప్రభుత్వ ఆస్తులు తనఖాపెట్టి రూ.23,200కోట్లు రుణాలు పొందారు. ఈ రుణంలో ఒక్క రూపాయి విశాఖ అభివృద్ధికి ప్రత్యేకంగా ఖర్చు చేశారా? అంటే సమాధానం లేదు. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకోవడానికి చిన్నపాటి ప్రయత్నమూ చేయలేదు. ఏం చేశారు అంటే రూ.450కోట్లు కుమ్మరించి బాగున్న పర్యాటశాఖ భవనాలు కూల్చి, రుషికొండపై విలాసవంతమైన రాజ భవనాలు నిర్మించుకున్నారు.

కట్టినవన్నీ కూలుతున్నాయ్‌ జగన్‌!

‘రుషికొండ’పై విలాసంగా కట్టుకున్న రాజసౌధం తప్ప... ప్రజల కోసం జగన్‌ హయాంలో కట్టినవన్నీ కూలిపోతున్నాయి. ఒక్కో బస్‌బేకు రూ.30-50లక్షలు ఖర్చు చేసినా పలు చోట్ల నాసిరకంగా మారాయి.  గంటల వ్యవధిలోనే జీవీఎంసీ ముందున్న బస్‌బే ఒక్కసారిగా కుప్పకూలిన విషయం విధితమే. ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని రూ.1.60 కోట్లతో ఏర్పాటు చేసి..ఆర్భాటంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో రోజే అది సాగ¢రంలో కొట్టుకుపోయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దాన్ని తిరిగి పునఃనిర్మించాలని యత్నించి చివరకు పక్కన పెట్టేశారు. దీనిని బట్టి జగన్‌కు కూల్చడమే తప్ప కట్టడం చేతకాదు అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

అతీగతీలేని మెట్రో: తెదేపా హయాంలో విశాఖ మెట్రోకు సంబంధించిన ప్రణాళికలు చివరి దశ వరకు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో అవన్నీ తలకిందులయ్యాయి. వైకాపా ప్రభుత్వ డీపీఆర్‌ ఆమోదం దశలోనే ఉంచింది. అప్పట్లో 42.5 కి.మీ. మేర నిర్మించాలనుకుంటే... వైకాపా ప్రభుత్వం  దాన్ని 140.13 కి.మీ.లకు పెంచి హడావుడి చేసింది. మొదటి కారిడార్‌ నిర్మాణ పనులను 2024కు పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన జగన్‌... మెట్రో రైలు ప్రాజెక్టు కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖకు తరలించడం తప్ప ఇటుకైనా వేయలేదు.

నత్తనడకన ఎన్‌ఏడీ ఆర్‌వోబీ: ఎన్‌ఏడీ పైవంతెనకు అనుసంధానంగా నిర్మించాల్సిన ఆర్‌వోబీ ఇంకా పూర్తవ్వలేదు. ఈ ప్రాజెక్టును గత తెదేపా హయాంలో ప్రారంభించారు. ఎన్‌ఏడీ వంతెన పూర్తయినప్పటికీ ఆర్‌వోబీని మూడేళ్లుగా పట్టించుకోకుండా వదిలేశారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఒక వంతు పనులనూ వైకాపా సర్కారు చేయలేక పోయింది.

జగన్‌ శంకుస్థాపనల్లో కొన్ని పనుల తీరు..

 • ప్రతి నియోజకవర్గానికి ఓ మినీ స్టేడియం, ఈతకొలను, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన అంటూ హామీలిచ్చి శంకుస్థాపనలు చేసిన జగన్‌ అభివృద్ధి చేయలేక పోయారు.
 • భీమిలి, తగరపువలస ప్రాంతాలలో నివసిస్తున్నవారికి సురక్షితమైన నీటి సరఫరాకు జగన్‌ శంకుస్థాపన చేశారు. దీనికి రూ. 10 కోట్లతో పైపులైను పనులు ప్రారంభించి, రూ.2కోట్ల పనులు చేసి, మిగతావి మధ్యలోనే విడిచిపెట్టారు.
 • భీమిలి నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో 10 సామాజిక భవనాలకు ‘స్థాయీ’లో అనుమతులు పొంది టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టేలోగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది.
 • రూ.20కోట్ల వ్యయంతో కృష్ణాపురం నుంచి హనుమంతువాక మంచినీటి సరఫరా పైపులైను పనులకు శంకుస్థాపన జరిగినా, కనీసం ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
 • రూ.109 కోట్లతో తీర ప్రాంత సుందరీకరణకు 2019లో శంకుస్థాపన జరిగింది. బీచ్‌ సుందరీకరణ, పార్కులు, రిక్రియేషన్‌ ఏరియా అభివృద్ధి, నేచురల్‌ బయో డైవర్సిటీ పార్కుల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా, ఒక్క పని ప్రారంభించలేదు.
 • రూ.52కోట్లతో సిటీస్‌ (సిటీ ఇన్వెస్ట్‌మెంటÂ్స టు ఇన్నోవేటÂ, ఇంటిగ్రేటÂ అండ్‌ సస్టైన్‌) పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు రూ.5 కోట్ల పనులు మాత్రమే జరిగాయి.

హామీలు పక్కనపెట్టి.. ఉల్లంఘనులకు పట్టంకట్టి..

 • హనుమంతువాక పైవంతెన నిర్మాణానికి రూ.50కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు.
 • తాడి గ్రామాన్ని ఫార్మా కాలుష్యం నుంచి రక్షిస్తానని, అందుకు అవససరమైన రూ.56 కోట్లు పదిపదిహేను రోజుల్లో విడుదల చేస్తానంటూ చెప్పి రెండేళ్లు అవుతుంది. తాజాగా ఎన్టీపీసీని ఆనుకుని ఉన్న స్వయంభువరం గ్రామ ప్రజలు .. దుమ్ము దూళితో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని, సమస్య పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఇలా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎన్నికలు బహిష్కరించిన తొలి గ్రామం ఇదే.
 • పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే గాలికొదిలేశారు.
 • పాండురంగాపురంలో రజకులకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా.. మర్చిపోయారు.
 • జోడుగుళ్లపాలెం జంక్షన్‌ వద్ద మత్స్యకారులకు వలలు అల్లుకునేందుకు షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఆర్‌జడ్‌ నిబంధనల పేరుతో పక్కన పెట్టేశారు. విజయసాయిరెడ్డి మాత్రం బీచ్‌ కారిడార్‌లో సీఆర్‌జËడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ శాశ్వత నిర్మాణాలు సాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇది కదా మోసం అంటే

ఎన్నికలకు ఆరు నెలలు ముందు శంకుస్థాపనలు చేస్తే అది మోసమని, అధికారంలోకి రాగానే శంకుస్థాపనలు చేస్తే అది చిత్తశుద్ధి అంటూ జగన్‌ నీతి వాఖ్యాలు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో విశాఖకు వచ్చిన జగన్‌ 2019లో ఒకేసారి జీవీఎంసీ, వీఎంఆర్డీకు సంబంధించి రూ.905కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఐదేళ్లలో కేవలం రూ.130కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో ఎక్కడ పనులు అక్కడే అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులను అసలు ప్రారంభించనేలేదు. తాజాగా ఎన్నికల కోడ్‌కు ముందు జీవీఎంసీ పరిధిలో రూ.1500కోట్ల పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన శంకుస్థాపనలు, ఎన్నికల ముందు చేసిన శంకుస్థాపనలు...రెండూ మోసమే అని నిరూపించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ముగిసిన ప్లానెటోరియం కథ: కైలాసగిరిపై అత్యాధునికంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానెటోరియం నిర్మించాలనుకున్నారు. కన్సల్టెంట్లను పిలిపించి ఆకృతులు సిద్ధం చేయించారు. స్థల పరిశీలన జరిపి ప్రభుత్వ అనుమతికి పంపించి వదిలేశారు. నాలుగున్నర సంవత్సరాల కిందట సీఎం శంకుస్థాపన చేసినా పక్కన పెట్టి.. ‘సైన్స్‌ సిటీ’ పేరుతో మరో ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారు.

మరుగున పడిన పరిశోధన సంస్థ: కాపులుప్పాడలో చారిత్రక సందర్శనాలయం-పరిశోధన సంస్థకు వీఎంఆర్‌డీఏ స్థలాన్ని ఎంపిక చేసింది. ఆకృతులు సైతం సిద్ధం చేసి డీపీఆర్‌ను ఇటీవల ప్రభుత్వానికి పంపి మమ అనిపించింది. నాలుగున్నరేళ్ల కిందట సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు.

 • 400 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు వీలుగా బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్‌ నిర్మాణం సాగుతోంది. దీనికి అప్పట్లో సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా రెండేళ్ల కిందటే పూర్తిచేయాలి. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నత్తనడకన సాగిస్తున్నారు.

అసంపూర్తి నిర్మాణాలతో కైలాసగిరి: హుద్‌హుద్‌కు దెబ్బతిన్న కైలాసగిరిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేయాలని అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు నిధులు తెచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ నిధులు మురిగిపోవడంతో పనులు చేయలేక చేతులెత్తేసింది. తరువాత తూతూమంత్రంగా పూర్తిచేసి మమ అనిపించారు. దీంతో చాలాచోట్ల కొండ మీద అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని