logo

జగనన్న సామంతులు.. అక్రమాలతో శ్రీమంతులు!!

‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తీరున వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు. జగన్‌ విశాఖను పీల్చిపిప్పి చేస్తే ‘మేం ఏం తక్కువ’ అంటూ భూ కబ్జాలకు తెగబడ్డారు.

Published : 22 Apr 2024 03:43 IST

 విశాఖ నగరమంతా ‘భూ’చోళ్లు!!
వైకాపా నాయకుల కబ్జాల పర్వం
 కొండలను పిండి చేసి గ్రావెల్‌ తరలింపు
భవన నిర్మాణాలపై కార్పొరేటర్ల దందా

‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తీరున వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు. జగన్‌ విశాఖను పీల్చిపిప్పి చేస్తే ‘మేం ఏం తక్కువ’ అంటూ భూ కబ్జాలకు తెగబడ్డారు.

విశాఖ పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు, గెడ్డలు, వాగులు, చెరువులు ఏదీ వదలకుండా ఆక్రమించేశారు. కొండలను పిండి చేసి అక్రమంగా మట్టి తరలించి జేబులు నింపేసుకున్నారు. డి-పట్టాలు, టీడీఆర్‌లు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు..ఇలా ఒకటేంటి? అవకాశం ఉన్న చోటల్లా దోపిడీ పర్వం సాగించారు.

మరోసారి అధికారం ఇస్తే మిగిలింది దోచేసేందుకు ‘సిద్ధం’ అంటూ జగన్‌తోపాటు బస్సు యాత్రలో వైకాపా నాయకులు, కార్పొరేటర్లు వస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనాడు-విశాఖపట్నం


నేతల భూ దాహం

  •  దక్షిణ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న వాసుపల్లి గణేష్‌కుమార్‌ ‘సేవ’పేరుతో మూడు చోట్ల 6.90ఎకరాలు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఎన్నికల వేళ కోరిందే తడవుగా సీఎంవో కార్యాలయ ఆదేశాలతో ఆగమేఘాలపై రూ.206కోట్ల విలువైన భూ సంతర్పణకు సిద్ధం చేశారు.
  •  ఉత్తరం వైకాపా అభ్యర్థి కేకే రాజు భీమిలిలో తను భాగస్వామ్యంగా ఉన్న వెంచర్‌కు రోడ్డు అడ్డుగా ఉందని వీఎంఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌నే మార్చేశారు. నేరెళ్లవలసలో రైతుల నుంచి డి-పట్టాలు నయానోభయానో లాక్కొని అవే భూములను వీఎంఆర్డీఏ సమీకరణలో అప్పగించి భారీగా లబ్ధి పొందారన్న విమర్శలున్నాయి.
  •  రూ.3 వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్లో వైకాపా పెద్దలు పాగా వేశారు. వాటాదారులుగా చెబుతున్న 64 మంది భూ యజమానులకు ఎక్కడాలేని విధంగా అతి తక్కువ వాటా దక్కేలా ఒప్పందం జరిగింది. పైగా ఈ భూముల మధ్యలో ఉన్న 40అడుగుల రోడ్డును వంద అడుగులకు విస్తరించేలా పావులు కదిపి, అందులోనూ టీడీఆర్‌ బాండ్లను నొక్కేసేందుకు పావులు కదిపారు.
  •  పరదేశీపాలెంలో ఓ విశ్రాంత జవాను పేరుతో 187/1 సర్వే నెంబరులో 4.89 ఎకరాలు కేటాయించి, వాటిని విక్రయించుకోవడానికి అధికారులతో అనుమతి ఇప్పించారు. ప్రణాళిక ప్రకారమే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి కుమారుడి చేతుల్లోకి ఆ విలువైన భూమి వెళ్లింది.
  •  గాజువాకలో ఓ మంత్రి ట్రస్ట్‌ పేరుతో స్థలాలు తీసుకుని అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. తన అనుచరగణంతో 609 ఎకరాల్లో వెంచర్‌ వేసి అందులో ప్రభుత్వ భూమి పది ఎకరాలకుపైగా కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.

కొండలకు గుండుకొట్టి

పెద్దలు రుషికొండను బోడి గుండు చేస్తే... మేం ఏం తక్కువ అంటూ వైకాపా నాయకులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. ప్రధానంగా భీమిలి నియోజకవర్గ పరిధిలో సుమారు 52 కొండల నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలిపోతోంది. భీమిలి పరిధిలో దాకమర్రి, కొత్తవల, నేరెళ్లవలస, అమనాం, చిప్పాడ, కాపులుప్పాడ, పద్మనాభం పరిధిలో నేరెళ్లవలస, గుడ్డివలసమెట్ట, కృష్ణాపురం, పాండ్రంగి పంచాయితీల్లో విస్తరించి ఉన్న సూదికొండ, బాంధేవపురం పల్లికొండ నుంచి భారీగా ఎర్రమట్టి తరలిపోతోంది. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామం నగరంపాలెం సమీపంలోని కొండను పూర్తిగా గుండుకొట్టారు. పెందుర్తి పరిధిలో నరవ, జెర్రిపోతుపాలెం, ఇప్పిలివానిపాలెం ప్రాంతాల్లో కొండలను గుల్ల చేస్తున్నారు. సబ్బవరం పరిధిలో పైడివాడ అగ్రహారం, గంగవరం, వెదుళ్ల నరవ, నంగినారపాడు పరిధిలో కొండలను తవ్వి గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఇలా విశాఖ పరిధిలో లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని ప్రతి నెలా తరలించి జేబులు నింపేసుకుంటున్నారు.

వార్డుల్లో దందాలు..

అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు జీవీఎంసీలో భారీ దందాలకు తెరలేపారు. కొత్తగా భవన నిర్మాణాలు జరుగుతుంటే చాలు...అక్కడ వాలిపోతున్నారు. సెట్‌బ్యాక్స్‌ వదల్లేదని, అనుమతుల్లో కొర్రీలున్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. భవన నిర్మాణ సముదాయాన్ని బట్టి రూ.లక్షల్లో సమర్పిస్తే కానీ పనులు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ఇదే విషయం స్వయంగా వైకాపా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఓ అంతర్గత సమావేశంలో ప్రస్తావించారు. ‘కార్పొరేటర్ల అవినీతి ఎక్కువైందని ఫిర్యాదులొస్తున్నాయి. ఎన్నికల వేళ ఇది మంచిది కాదు’ అంటూ  హితవు పలికారంటే కార్పొరేటర్ల దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోళ్ల వ్యర్థాలను సైతం ఓ కార్పొరేటర్‌ గోదావరి జిల్లాల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలు, గెడ్డవాగులను పూడ్చి దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిస్తున్నారు.

టీడీఆర్‌ల కుంభకోణం

  •  పెదజాలారిపేటలోని 20.27 ఎకరాలు రాణిసాహిబా వాద్వాన్‌వి అని, మార్కెట్‌ ధరకు నాలుగు రెట్లు టీడీఆర్‌లు కేటాయించాలంటూ సుమారు రూ.2,800 కోట్లకు ప్రతిపాదనలు పెట్టడం కలకలం రేపింది.
  •  సీతమ్మధార సమీపంలోని రేసవువానిపాలెం సర్వే నెంబరు 7లో సుమారు 3.90ఎకరాలు ఆంధ్రాబ్యాంకు హౌసింగ్‌ కో-ఆపరేటీవ్‌ సొసైటీ భూమిగా దరఖాస్తు చేశారు. అయితే అక్కడ ప్రస్తుతం 3.11 ఎకరాల్లో బిలాల్‌ కాలనీ ఉంది. ఈ భూమికి రూ.వెయ్యి కోట్ల టీడీఆర్‌లు మంజూరు చేయాలంటూ వైకాపా ముఖ్యనేత కనుసన్నల్లో దరఖాస్తు చేసినట్లు సమాచారం.
  •  సీఎంఆర్‌ గోదాం వెనుక వైపు పాత 20వ వార్డులో వెంకటపతిరాజు నగర్‌ మురికివాడలో 0.76 ఎకరాలు ప్రైవేటు వ్యక్తికి చెందినవిగా చూపించి రూ.100 కోట్ల టీడీఆర్‌లకు పావులు కదిలాయి.
  •  మధురవాడ బక్కన్నపాలెం సర్వే నెంబరు 2లో జీవీఎంసీ దాదాపు పదేళ్ల క్రితమే రోడ్డు వేసింది. తాజాగా ఆ రోడ్డు విస్తరణలో తమ భూమి 2 ఎకరాలు పోయిందంటూ రాయలసీమకు చెందిన వైకాపా నాయకుడు చక్రం తిప్పారు. దీనికై రూ.120 కోట్ల టీడీఆర్‌ బాండ్లు తాడేపల్లి ఆదేశాలతో ఆగమేఘాలపై మంజూరు చేయడానికి అడుగులు పడ్డాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని