logo

జగన్‌ దండాలు.. జనానికి గండాలు: బస్సు యాత్రతో ట్రాఫిక్‌ ఆంక్షలు

 విశాఖలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం నిర్వహించిన బస్సు యాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రయాణికులు విసిగెత్తిపోయారు.

Updated : 22 Apr 2024 08:12 IST

 మండుటెండలో జనం పాట్లు
 గంటలకొద్దీ నిరీక్షణతో అసహనం

 

జగన్‌ యాత్రలో... కరాస బీఆర్టీఎస్‌ రహదారిలో దీపం లేని విద్యుత్తు స్తంభం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం నిర్వహించిన బస్సు యాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రయాణికులు విసిగెత్తిపోయారు. గంటలకొద్ది నిరీక్షించలేక అల్లాడిపోయారు. ఆదివారం యాత్ర పినగాడి కూడలి నుంచి లక్ష్మీపురం మీదుగా వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ కూడలి, ఊర్వశి, కంచరపాలెం మెట్టు, దొండపర్తి, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడకు చేరుకుంది. రాత్రి అక్కడ సీఎం జగన్‌ బస చేశారు.  యాత్రలో అక్కడక్కడ బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేయగా.. చాలా సమయం బస్సు లోపల నుంచే ప్రజలకు చేయి ఊపుతూ కనిపించారు. ఎక్కడా ప్రసంగించలేదు. ప్రజలకు దండాలు పెడుతూ వెళ్లారు.

ఎండలో జనం ఉక్కిరిబిక్కిరి

వేపగుంట నుంచి పినగాడి వెళ్లే  రోడ్డులోకి ఎవర్నీ అనుమతించకుండా ఆదివారం ఉదయం నుంచే ఆ మార్గాన్ని మూసివేశారు. దీంతో జీవీఎంసీ పరిధిలోని పది కాలనీలతోపాటు, పినగాడి, రాంపురం, పెదగాడి, చింతల అగ్రహారం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సబ్బవరం, కోటపాడు వైపు వెళ్లాలంటే ఈ మార్గమే కీలకం. దీనిని మూసి వేయడంతో 6 కి.మీ. ముందుకెళ్లి పెందుర్తి జంక్షన్‌ చుట్టూ తిరిగి వెళ్ల్లాల్సి వచ్చింది. సీఎం పినగాడి కూడలి బ్రిడ్జి వద్దకు రాగానే పినగాడి-పెందుర్తి రోడ్డులో గంటపైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎండలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పినగాడి జంక్షన్‌ నుంచి పెదగాడి వరకు 3 కి.మీ. పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. వేపగుంట జంక్షన్‌ వద్ద రెండు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిపి వేశారు. బీఆర్టీఎస్‌లో రాకపోకలు నిలిపి వేయడంతో మిట్ట మధ్యాహ్నం ఎండలో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరైపోయారు. పెందుర్తి నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రావడానికి మూడు గంటల సమయం పట్టింది. చిన్నపిల్లలు, మహిళలతో ప్రయాణాలు సాగించినవారు ఆపసోపాలు పడ్డారు. యాత్ర ఎండాడ కూడలికి చేరుకునే మార్గంలో పలుచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

వేపగుంట కూడలిలో భారీగా నిలిచిన ట్రాఫిక్‌

జగన్‌ బస్సు యాత్రలో కంచరపాలెం మెట్టు నుంచి మహారాణి పార్లల్‌ మీదుగా వెళతారని తొలుత ప్రకటించారు. అయితే... మహారాణిపార్లర్‌ 80 అడుగుల రోడ్డులో ప్రచారం చేసిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈ మార్గంలో ప్రచారం చేస్తే జగన్‌కు కూడా అలాగే జరగొచ్చనే చర్చజరిగింది. దీంతో నాయకులు యాత్ర మార్గాన్ని కంచరపాలెం మెట్టు నుంచి దొండపర్తి మీదుగా మళ్లించడం గమనార్హం. అప్పటికే ముందుగా అనుకున్న మార్గంలో దుకాణాలు మూయించేశారు. తమ పొట్టకొట్టారని దుకాణదారులు వాపోయారు.

అభ్యర్థుల పరిచయాల్లేవ్‌...: జగన్‌ బస్సు యాత్రలో ఏదో ఒక చోట సిద్ధం సభ నిర్వహించడం, ఆ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులను పరిచయం చేయడం పరిపాటి.  విశాఖలో మాత్రం రోడ్‌షోతోనే సరిపెట్టారు.

అంతా అంధకారం: జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.  వేపగుంట ప్రాంతంలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో స్థానిక ప్రజలు అవస్థలకు గురయ్యారు. సాయంత్రం రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి రోడ్డులో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని