logo

Blood Pressure: రక్తపోటు మేల్కొనకుంటే చేటు.. యువతలో అధికంగా నమోదు

నేటి యువత ఆహారపు అలవాట్లు.. జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల కారణంగా జిల్లాలో ఎక్కువ మంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు.

Updated : 24 May 2024 08:37 IST

జీవనశైలి.. ఆలవాట్లే కారణమట

 • విజయనగరానికి చెందిన 30 ఏళ్ల వ్యాపారికి ఇటీవల నడుస్తుంటే కళ్లు తిరుగుతున్నట్లుగా వరుసగా రెండ్రోజులు అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రక్తపోటు ఉన్నట్లు వైద్యుడు తెలిపారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, బయట తిళ్లు అలవాటు కావడమే కారణమని  నిర్ధారించి మందులు ఇచ్చారు. 

 • రాజాంలో ఒక యువకుడు పార్ట్‌టైంగా ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఉద్యోగపరమైన ఒత్తిడి ఎక్కువైంది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ రోజు కళ్లుతిరిగి పడిపోయాడు. ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకోగా బీపీ ఎక్కువైందంటూ మందులు ఇచ్చారు. అతని వయసు 26 ఏళ్లే. 

 • భోగాపురానికి చెందిన ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడ్డారు. 38 ఏళ్లు దాటక ముందే రక్తపోటు, మధుమేహనికి గురై కొన్నేళ్లుగా ఔషధాలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి చివరికి ఇంట్లో ఉంటూనే కోమా లోకి వెళ్లి మృతి చెందారు.  

సర్వజన ఆసుపత్రిలో అవగాహన కల్పిస్తున్న వైద్యులు  

న్యూస్‌టుడే, విజయనగరం వైద్య విభాగం: నేటి యువత ఆహారపు అలవాట్లు.. జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల కారణంగా జిల్లాలో ఎక్కువ మంది రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ లక్షణాలు నేడు ఉడుకు రక్తంతో మరిగిపోవాల్సిన యువతలోనూ కనిపిస్తోంది. 30 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బీపీ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. కొవిడ్‌ తర్వాత ఈ కేసులు మరింత పెరిగాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, సమయపాలన అలవర్చుకోకపోవడం వంటి కారణాలతో నగరాల్లోని యువత ప్రధానంగా హైపర్‌ టెన్షన్‌ బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

పురుషులే అధికం 

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు, శృంగవరపుకోట, గజపతినగరం, భోగాపురం, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం ప్రాంతీయ వైద్యశాలలకు వచ్చే వారిలో బీపీ బాధితులే అధికం. అవుట్‌ పేషెంట్స్‌లో 40 శాతం మందికి సాధారణ మందులతో పాటు వైద్యులు బీపీకి మందులు రాసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే 104 సంచార వాహనాల ద్వారా తరచూ పరీక్షలు నిర్వహించుకుని, బీపీ ఔషధాలు తీసుకునేవారు జిల్లాలో 50 వేల మందికిపైగా ఉన్నారు. ఏటా ఈ బాధితులు 6-8 శాతం పెరుగుతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పక్షవాతం, కంటిచూపు తగ్గడం, కిడ్నీలు విఫలమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీరికి మధుమేహం జతయ్యే ప్రమాదముందని అంటున్నారు. ఈ బాధితుల్లో పురుషులే అధికంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

ఇవీ లక్షణాలు..

 • మెదడులో రక్తనాళాలు దెబ్బతినడం
 • కంటి రక్తనాళాలు బలహీన పడటం
 • కంటి చూపు తగ్గడం
 • పక్షవాతం
 • జీవక్రియలో మార్పులు
 • మూత్ర పిండాలలో రక్తనాళాలు బలహీన పడటం
 • జ్ఞాపకశక్తి కోల్పోవడం
 • తలనొప్పి, అలసట, మసక దృష్టి, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హృదయ స్పందనలో మార్పు, గుండె దడ, కళ్లు తిరగడం, ఆయాసం రావడం, కాళ్ల వాపులు రావడం.

జాగ్రత్తలు తీసుకోవాలి 

ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేస్తే శరీరంలో చెడు కొవ్వు కరిగిపోతుంది. ఉదయం, సాయంత్రం నడకతో రక్తప్రసరణ, గుండె పనితీరు బాగుంటుంది. మాంసం, మద్యపానం, పొగతాగే అలవాటు తగ్గించుకోవాలి. దంపుడు బియ్యం, కొర్రలు, రాగులు, జొన్నలతో వండినవి ఆహారంగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకావద్దు. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఎన్‌సీడీ సెల్‌ ద్వారా చికిత్స అందిస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు ఓపీ సంఖ్య పెరిగింది. 

డాక్టర్‌ జి.మురళీకృష్ణ, ఎన్‌సీడీ సెల్, ప్రత్యేక వైద్యాధికారి, సర్వజన ఆసుపత్రి, విజయనగరం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు