logo

అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కకు మించిన ఖర్చు చేస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన పరిమితి లోపే చూపిస్తున్నారు. ఈ క్రమంలో 2014లో ఎంపీ అభ్యర్థి గరిష్ఠ వ్యయ పరిమితి రూ.70 లక్షలు ఉండగా, 2022లో రూ.95 లక్షలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. 

Updated : 22 May 2024 07:19 IST

ఈసీకి సమర్పించేవి కాకిలెక్కలే

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కకు మించిన ఖర్చు చేస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన పరిమితి లోపే చూపిస్తున్నారు. ఈ క్రమంలో 2014లో ఎంపీ అభ్యర్థి గరిష్ఠ వ్యయ పరిమితి రూ.70 లక్షలు ఉండగా, 2022లో రూ.95 లక్షలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. 

ఈనాడు-విజయనగరం: ఒకప్పుడు ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చుకు, ఈసారికి ఎంతో వ్యత్యాసం కనిపించింది. రికార్డు స్థాయిలో పంచారు. రూ.500 నోట్ల కట్టలు రూ.కోట్లలోనే కరిగిపోయాయి. విచ్చలవిడిగా డబ్బులిచ్చారు. 

ఎన్నికలంటే అభ్యర్థిత్వం ఖరారు.. నామినేషన్‌  దాఖలు.. ప్రచార పర్వం.. పోలింగ్‌ పైకి కనిపిస్తాయి. వీటికి సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులు పరిమితి లోపే ఖర్చు చేయాలి. ఈ లెక్కలన్నీ అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలి. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారని రాజకీయ పరిశీలకుల అంచనా. విజయనగరం, ఎస్‌.కోట, బొబ్బిలి, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఖర్చు రూ.125 కోట్లకు పైగా ఉంటుందని వారు భావిస్తున్నారు. అభ్యర్థులు నోట్లకు ఓట్లు రాలుతాయని బలంగా నమ్మి తాయిలాలు పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం నిఘాకు చిక్కకుండా చక్కబెట్టారు. వారంతా తక్కువలో తక్కువ రూ.20 కోట్ల వరకు చేతిలో పెట్టుకుని బరిలోకి దిగారు. 

బుజ్జగింపులు.. పంపకాలు 

సొంత పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు వారి అనుచరుల ద్వారా ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ప్రాంతాల వారీగా ప్రాబల్యం ఉన్న నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి భారీ నజరానాలు సమర్పించారు.  

ప్రత్యేక సమావేశాలు : ప్రధానంగా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. అలుపెరగకుండా రోజుకు మూడు నాలుగు పెట్టి ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. వచ్చిన వారికి మంచి విందు భోజనాలు పెట్టారు. ఇక ప్రచారం చేసిన వారికి ఉదయం టీ, కాఫీ, అల్పాహారం నుంచి రాత్రి భోజనాల వరకు క్యాటరింగ్‌ ఏర్పాట్లు, వీరితో పాటు ఓటర్లకు మద్యం సరఫరా, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో చేశారు. అలాగే నామినేషన్‌ వేసిన నాటి నుంచి పోలింగ్‌ వరకు రోజూ వినియోగించే అధికారిక, అనధికారిక వాహనాల అద్దెలు, సొంత వాహనాలు ఉన్న వారికి ఇంధనం సరఫరా చేశారు.  

ప్రాంతాల వారీగా రేటు 

రెండు జిల్లాల్లో ప్రాంతాల వారీగా కాసుల పంపకాలకు రేటు నిర్ణయించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు తొలుత రూ.500 పంపిణీ చేసినా, నాయకుల ఒత్తిడితో రూ.వెయ్యికి తగ్గకుండా అందజేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో స్థానిక పరిస్థితులను బట్టి 60 - 70 శాతం మందికి మాత్రమే పంపిణీ చేశారు. పట్టు తక్కువ ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లకు ఒక్కొక్కరికీ రూ.1500 వరకు పంచాల్సి వచ్చింది. అభ్యర్థులకు నాయకత్వమే నిధులిచ్చింది. నామినేషన్‌ రోజే పంచాయతీకి రూ.లక్ష తక్కువ లేకుండా వెచ్చించి జనసమీకరణ చేయాలని సూచించింది. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు నాయకులు, మాజీ వాలంటీర్ల ద్వారా పంపిణీ వేగవంతం చేశారు. అక్కడక్కడ నాయకులు, వాలంటీర్లు కలిసి చేతివాటం ప్రదర్శించినట్లు పోలింగ్‌ అనంతరం బయటపడింది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని