logo

పిక్కలు పీకేస్తున్నాయ్‌... ప్రాణాలు తీసేస్తున్నాయ్‌..!

మీ పిల్లలను వీధిలోకి పంపిస్తున్నారా.. మీరు ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే.. ఏ కుక్క ఎప్పుడు.. ఎక్కడ దాడి చేస్తుందో.. ఏ పిక్క లాగుతుందో..  ఎవరి ప్రాణాలు తీస్తుందో తెలియడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇటీవల కుక్కల దాడులు భారీగా పెరిగాయి.

Updated : 28 May 2024 10:55 IST

పెరుగుతున్న కుక్కల దాడులు  
నెల వ్యవధిలో ఇద్దరి మృతి 
జిల్లా ఆసుపత్రిలోనే 990 కేసులు 

మీ పిల్లలను వీధిలోకి పంపిస్తున్నారా.. మీరు ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే.. ఏ కుక్క ఎప్పుడు.. ఎక్కడ దాడి చేస్తుందో.. ఏ పిక్క లాగుతుందో..  ఎవరి ప్రాణాలు తీస్తుందో తెలియడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇటీవల కుక్కల దాడులు భారీగా పెరిగాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నియంత్రణ చర్యలు కానరాకపోవడంతో వందల సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, గ్రామీణం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో ప్రతి నెలా వందల సంఖ్యలో కుక్కకాటు బాధితులు ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వారి సంఖ్య 400కు పైగానే ఉంటోంది. జిల్లా ఆసుపత్రిలోనే నెలకు 200 పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే ఈ ఏడాది మార్చిలో అల్లువాడకు చెందిన నాగభూషణం, పెదకుదమకు చెందిన డి.రవికుమార్, ఏప్రిల్‌ 24న పెదమేరంగి కూడలిలో సింగనాపురం గ్రామస్థురాలు జి.లక్ష్మి, వెంకటరాజపురం గ్రామస్థులు జి.సరోజిని, ఎ.మహేశ్వరి, సీమనాయుడువలస, దాసరిపేటలకు చెందిన ఎస్‌.శంకరరావు, ఆర్‌.లక్ష్మితో పాటు మరో 70 మందికిపైగా గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు.  

ఈ నెల 11న వెంకటరాజపురంలో కుక్కలు దాడి చేసి వృద్ధురాలు లక్ష్మిని  చంపేశాయి. ఆమె మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు (పాత చిత్రం)

పట్టించుకోని యంత్రాంగం 

జీవ హింస చట్టాల ప్రకారం కుక్కలను హింసించడం, చంపడం నిషిద్ధం. ఎప్పుటికప్పుడు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలి. కానీ పురపాలికలు, పంచాయతీల్లో నిధుల లేమితో ఆ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. కుక్కకు శస్త్రచికిత్స చేస్తే దానిని ప్రత్యేక బోనులో ఉంచాలి. వారం పాటు మందులు, ఆహారం ఇచ్చేందుకు రూ.వేలల్లో ఖర్చు చేయాలి. దీంతో యంత్రాంగం అటుగా అడుగులు వేయడం లేదు. శస్త్రచికిత్స చేసిన కుక్క మృతి చెందితే నేరంగా భావిస్తారని పశువైద్య అధికారులు సైతం అటు వైపు చూడడం లేదు. దీంతో కుక్కల సంతతి పెరిగిపోయి ముప్పులా పరిణమిస్తోంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండలో 2 వేల వరకు, గ్రామాల్లో మరో 7 వేల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.   

గుమ్మలక్ష్మీపురంలో గుంపుగా సంచరిస్తున్న శునకాలు 

జాగ్రత్తలు అవసరం 

ఎండల తీవ్రత, ఉక్కబోతతో కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఏటా వేసవిలో ఇదే సమస్య వస్తుంది. వాటికి నీరు, నీడ, తిండి కరవవ్వడంతో పాటు వేసవి తాపంతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. బయటకు చిన్నపిల్లలను ఒంటరిగా పంపకూడదని హెచ్చరిస్తున్నారు. కుక్కల గుంపు ఉంటే దాన్ని గమనిస్తూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

నియంత్రణ చర్యలు చేపడతాం 

గ్రామాల్లో ఇటీవల కుక్కకాట్లు పెరిగాయి. వీటి  నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. పురపాలక సంఘాల్లో పట్టిన కుక్కలను గ్రామాల పరిసరాల్లో వదులుతున్నట్లు సమాచారం ఉంది. దీంతో సమస్య ఎదురవుతోంది. త్వరలో ప్రత్యేక బృందాలను నియమించేలా ఆలోచన చేస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి. 

- బి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి 

  • జియ్యమ్మవలస మండలంలోని బిత్రపాడు గ్రామానికి చెందిన నీరస శంకరరావు సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు బాధితున్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  
  • జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో ఈ నెల 11న బి.లక్ష్మి అనే వృద్ధురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో కుక్కలు దాడి చేశాయి. ఆమె తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. 
  • కొమరాడ మండలం గంగిరేయివలసకు చెందిన మహిళ వీధిలో వెళ్తుండగా కుక్క దాడి చేసి తలపై తీవ్రంగా గాయపర్చింది. బాధితురాలిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 
  • ఇటీవల గరుగుబిల్లి మండలంలో కుక్కలు దాడి చేయడంతో ఒకే రోజు 13 మందికి పైగా గాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలో మరోసారి జరిగిన దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని