logo

Mangapeta: నమ్మించి.. బురిడీ కొట్టించి.. బ్యాంకులో బంగారం మాయం చేసిన అప్రైజర్‌ లీలలెన్నో..

మంచివాడిగా నటిస్తూ.. పరిచయాలు పెంచుకున్నాడు. బ్యాంకులో అప్రైజర్‌గా చేరి అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ నమ్మించాడు. అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్ల విలువైన బంగారం మాయం చేశాడు.

Updated : 29 May 2024 08:05 IST

ఖాతాదారులతో మాట్లాడుతున్న మంగపేట ఎస్సై రవికుమార్‌ 
ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, మంగపేట, న్యూస్‌టుడే: మంచివాడిగా నటిస్తూ.. పరిచయాలు పెంచుకున్నాడు. బ్యాంకులో అప్రైజర్‌గా చేరి అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ నమ్మించాడు. అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్ల విలువైన బంగారం మాయం చేశాడు. ఆభరణాలను తయారు చేసి ఇస్తానని తోటి స్వర్ణకారులనూ మోసగించాడు. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంకులో రూ.1.44 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు మాయం చేసిన అప్రైజర్‌  సమ్మెట ప్రశాంత్‌కు సంబంధించిన ఆర్థిక నేరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి..ఈ విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై ములుగు జిల్లాలోని మంగపేట పోలీసు స్టేషన్‌లో ఒకటి, వరంగల్‌ జిల్లాలోని మట్టెవాడ ఠాణాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎలా చేశాడంటే.. 

వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రాంతానికి చెందిన సమ్మెట ప్రశాంత్‌ గతేడాది నుంచి రాజుపేటలోని కెనరా బ్యాంకులో అప్రైజర్‌గా ఉంటున్నాడు. ఆభరణాలు తాకట్టుపెట్టి రుణం తీసుకునే వారు బ్యాంకుకు వస్తే.. వాటిని పరిశీలించి, విలువ లెక్కించి బ్యాంకు అధికారులకు చెప్పడం ఆయన పని. నిత్యం బంగారాన్ని చూసి అత్యాశతో పెద్ద మొత్తంలో దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా బ్యాంకు సమీపంలోనే బంగారం దుకాణాన్ని తెరిచాడు. అప్రైజర్‌గానూ.. ఇటు స్వర్ణకారుడిగానూ పనిచేస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకున్నాడు. రుణం తీసుకునే వారు ముందుగానే ఆయన దుకాణం వద్దకొచ్చేవారు.. 

  •  బ్యాంకు అధికారులతో సన్నిహితంగా ఉండడం ప్రారంభించాడు. బ్యాంకులో రుణం కోసం వచ్చిన వారి ఆభరణాల విలువ లెక్కగట్టి అధికారులకు చెప్పేవాడు. అదే సమయంలో వాటి ఫొటోలు తీసుకునేవాడు. వాటి ఆధారంగా రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలను తయారు చేయించి వాటిని బ్యాంకులో పెట్టేవాడని తెలిసింది. కొందరు ముందస్తుగా రుణం కోసం ఆభరణాలతో దుకాణం వద్ద ప్రశాంత్‌ను కలిసేవారని, వాటిని చూసి అదేవిధంగా ఉన్నవాటిని తయారు చేసి.. బ్యాంకులో ఇచ్చేలా పకడ్బందీగా వ్యవహారం నడిపించాడు. 

వేరే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి..: బ్యాంకు నుంచి అపహరించిన నగలను విక్రయిస్తే అనుమానం వస్తుందని తనకు తెలిసినవారితో ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టించి సొమ్ము చేసుకున్నాడని తెలుస్తోంది. ఏకంగా 27 మంది ఖాతాదారుల ఆభరణాలు కనిపించడం లేదని సమాచారం. 

బెట్టింగ్‌లకు పాల్పడి..

నగలు అపహరించి సొమ్ము చేసుకుని జల్సాలకు, బెట్టింగ్‌లకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు జూదం ఆడేవాడని, సులువుగా డబ్బులు వస్తుండటంతో ఇష్టారీతిన ఖర్చు చేసినట్లుగా సమాచారం. 

బ్యాంకు సిబ్బందిపై ఆరా 

పెద్ద మొత్తంలో ఆభరణాలు కనిపించకపోయినా బ్యాంకు సిబ్బంది కనిపెట్టలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిట్‌లో విషయం బయటపడటంతో సిబ్బంది పాత్రపైనా పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది సమక్షంలోనే నగలు తూకం వేసి ఆ తర్వాత లాకర్‌లో భద్రపరుస్తారు. ఈ క్రమంలో సిబ్బంది కళ్లుగప్పి మాయం చేశాడా? ఎవరి సహకారమైనా తీసుకున్నాడా? తదితర అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్యాంకు సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ఇక్కడి సిబ్బందిని ఇతర బ్రాంచీలకు బదిలీ చేసినట్లుగా తెలిసింది. మరోవైపు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

 ఎవరినీ వదల్లేదు.. 

  •  పరిచయాలు పెంచుకుని పెద్దఎత్తున అప్పులు చేశాడు. అధిక వడ్డీ ఇస్తానని మంగపేట మండలంలోని బాలాయిగూడెంలో ఓ వ్యక్తి వద్ద రూ.16 లక్షలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్థానికంగా చిట్టీలు వేసి ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదని సమాచారం.
  •  తోటి స్వర్ణకారులను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వరంగల్‌ నగరంలోని మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలువురు స్వర్ణకారుల నుంచి 46 తులాల బంగారం వ్యాపారం నిమిత్తం తీసుకెళ్లాడు. వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

బాధితుల ఆందోళన

పెద్దఎత్తున బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయని బయటకు తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.  సోమవారం బ్యాంకు ఎదుట నిరసనకు దిగారు. పోలీసులు, బ్యాంకు అధికారులు భరోసా ఇవ్వడంతో శాంతించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు