logo

పేరుకే పీఏ.. చేసేవన్నీ దందాలే..

‘ఎమ్మెల్యే పీఏ.. పవర్‌ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు.

Updated : 03 Dec 2022 12:58 IST

ఈనాడు, వరంగల్‌, వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే

శివ

‘ఎమ్మెల్యే పీఏ.. పవర్‌ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ వద్ద ప్రయివేటు పీఏగా పనిచేస్తున్న శివపై గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదు కావడం నగరంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో శివ చేసిన దందాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నరేందర్‌ మేయర్‌గా ఉన్నప్పటి నుంచీ  ఆయనకు సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అనేక రకాలుగా అధికారాలు చలాయిస్తూ దందాలకు తెరలేపాడు.

* తూర్పులో నిరుద్యోగుల కోసం గతంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆ సమయంలో శివ పలువురు విద్యార్థినుల చరవాణి నెంబర్లు తీసుకొని వారిని వేధింపులకు గురిచేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పేరుతో వారికి వలవేసి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. మరికొందరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్నారు.

* పలు భూవివాదాల్లో తలదూర్చడంతో పాటు వరంగల్‌ డివిజన్‌లో పనిచేసే పలువురు పోలీసు అధికారులపై పెత్తనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా పీఏ పేరుతో సకల మర్యాదలు శివ అందుకునేవాడు. మేయర్‌గా ఉన్నప్పుడు నరేందర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించాలని పలువురు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నరేందర్‌ తూర్పు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆగడాలు మరింత శ్రుతిమించాయి. ఒక భూవివాదంలో పోలీసుల పేరు చెప్పి బాధితుడి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. చివరకు భూవివాదం పరిష్కారం కాకపోవడంతో బాధితుడు నేరుగా పోలీసు అధికారి వద్దకు వెళ్లి చెప్పగా అసలు శివ తనకు డబ్బు ఇవ్వలేదని.. తాము చట్ట విరుద్ధంగా పనిచేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బాధితుడు శివ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. శివపై ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.

కేసు కాకుండా ఒత్తిడి

గత ఫిబ్రవరి నుంచి శివ తనపై తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఓ న్యాయ విద్యార్థిని  గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు కాకుండా ఉండేందుకు శివ కుటుంబ సభ్యులు లాబీయింగ్‌ చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థినితో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నించగా ఆమె కుటుంబసభ్యులు వినలేదు. దీంతో శివ పోలీసు ఉన్నతాధికారులను సైతం కలిసి కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. బాధిత మహిళ మాత్రం తనకు న్యాయం జరగాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టు కాగా.. బాధితురాలిపై మరో వ్యక్తి కూడా అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ప్రస్తుతం సదరు నిందితుడు విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నారు.


అనవసరంగా నాపై బురద చల్లుతున్నారు..
- నన్నపునేని నరేందర్‌, తూర్పు శాసనసభ్యుడు

నా రాజకీయ పలుకుబడిని దెబ్బకొట్టడానికి కొందరు పనిగట్టుకొని అనేక ఆరోపణలు చేస్తున్నారు. నా వద్ద సుమారు 40 మంది పని చేస్తారు. వాళ్లలో శివ ఒకరు. నా పేరు చెప్పి అతను ఏనాడూ వసూళ్లకు పాల్పడినట్లు నా దృష్టికి రాలేదు. అలా చేసినట్టు తెలిస్తే ఇప్పటికే తొలగించేవాడిని.  తాజాగా శివపై నమోదైన కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నిజానిజాలు తేల్చడానికి పోలీసులు, న్యాయస్థానం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు