logo

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పరీక్ష లేకుండా ప్రవేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశం కోసం గతేడాది వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు.

Published : 27 Mar 2023 06:04 IST

ఇంటర్‌లో చేరికపై కొత్త నిర్ణయం

మరిపెడ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశం కోసం గతేడాది వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఆ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించేవారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రవేశ పరీక్ష విధానాన్ని గురుకుల విద్యాలయ సంస్థ ఎత్తివేసింది. కేవలం గురుకుల పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే గురుకుల కళాశాలలో ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌ ప్రవేశం కోసం ప్రత్యేక ఆప్‌ద్వారా తమ వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆకాంక్షకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్మీడియట్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్లకంటే ఎక్కువ మంది ఒకే గ్రూపు ఎంచుకుంటే వేరే గురుకులాల్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఖాళీగా ఉన్న సీట్లను ఇతర పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. దీంతో ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గురుకులాల్లో ప్రవేశం పొందాలనే ఆశ అడియాశగా మిగలనుంది.


రీజియన్‌ పరిధిలో 26 కళాశాలలు

మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 26 గురుకుల పాఠశాలలు గతంలోనే ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఈ విధానంతో ఆయా పాఠశాలల్లో చదువుకునే వారికి ఆయా ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అనంతరం రీజియన్‌ పరిధిలోని ఇతర గురుకులాల్లో సైతం విద్యార్థులకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన సీట్లు మాత్రమే ఇతర పాఠశాలల్లో చదివిన విద్యార్థులతో భర్తీ చేయనున్నారు.


ఈ ఏడాది నుంచి ప్రవేశ పరీక్ష ఉండదు.
- ప్రత్యూష, రీజియన్‌ కోఆర్డినేటర్‌

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ) కళాశాలల్లో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాం. సాధారణ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహించడం లేదు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థుల ప్రవేశం అనంతరం ఇతర పాఠశాలల్లో చదివిన వారికి ప్రవేశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. సీట్ల భర్తీపై మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని