logo

Modi - Warangal: విమానం.. మోదీ ఇవ్వాలి బహుమానం!

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. పర్యాటక, సాంస్కృతిక నిలయంగా, విద్యాకేంద్రంగా పేరు పొందింది. అలాంటిది వరంగల్‌లో విమానాశ్రయం లేదు. రాకపోకలు సాగించేవారు బస్సులు, రైళ్లు, కార్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

Updated : 05 Jul 2023 09:42 IST

మామునూరుపై మళ్లీ చిగురిస్తున్న ఆశలు
జులై 8న ప్రధానికి ఇక్కడే హెలిప్యాడ్‌ ఏర్పాటు
ఈనాడు, వరంగల్‌, మామునూరు, కాశీబుగ్గ, న్యూస్‌టుడే

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం ఓరుగల్లు. పర్యాటక, సాంస్కృతిక నిలయంగా, విద్యాకేంద్రంగా పేరు పొందింది. అలాంటిది వరంగల్‌లో విమానాశ్రయం లేదు. రాకపోకలు సాగించేవారు బస్సులు, రైళ్లు, కార్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8న వరంగల్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుచేయాలన్న డిమాండు ఎప్పటినుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర పౌర విమానయాన శాఖను ఇక్కడ ఎయిర్‌పోర్టు పెట్టాలని కోరింది. ‘ఉడాన్‌’ పథకం కింద మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌లు సైతం కేంద్రానికి విన్నవించారు. ఓరుగల్లులో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న మోదీకి విమానాశ్రయం ఆవశ్యకతను వివరిస్తే సత్వరమే ఎయిర్‌పోర్టు సాకారమయ్యే అవకాశం ఉంది.

ఎంతో  ఘన చరిత్ర

మామునూరు విమానాశ్రయాన్ని 1930లో చివరి నిజాం మీర్‌ (ఉస్‌మాన్‌) అలీఖాన్‌ ఏర్పాటుచేశారు. అజంజాహి మిల్లు వస్త్ర, కాగజ్‌నగర్‌ కాగితపు పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు దీన్ని నెలకొల్పారు. 1981 వరకు అనేక మంది ప్రముఖులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. భారత్‌ చైనా యుద్ధ సమయంలో దిల్లీలోని విమానాశ్రయానికి ముప్పు పొంచి ఉన్నందున మామునూరు ఎయిర్‌పోర్టు కీలకంగా మారింది. మనుగడలో ఉన్నప్పుడు 1857 ఎకరాలతో రెండు కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో సిబ్బంది వసతి, పైలట్ శిక్షణ కేంద్రం ఉండేది.

సమయం ఆదా..

రైలు బెర్త్‌ కావాలంటే కొన్ని నెలల ముందే బుక్‌ చేసుకోవాలి. అదే సమయంలో విమానం బుక్‌ చేసుకుంటే టికెట్టు ధరలు తక్కువే ఉంటున్నాయి. పైగా  సమయం ఎంతో ఆదా అవుతుంది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళితే కనీసం రూ.4 వేల వరకు తీసుకుంటున్నారు. వరంగల్‌లో విమానాశ్రయం అయితే ఈ ఖర్చులు, సమయం కలిసొస్తుంది.

నేరుగా తిరుపతికి వెళ్లొచ్చేవాళ్లం

తిరుపతి విమానాశ్రయంలో తల్లితో శ్రీజ

హనుమకొండకు చెందిన ఐటీ ఉద్యోగిని శ్రీజ ఇటీవల కుటుంబంతో తిరుమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దర్శనం ఆలస్యం కావడంతో రైలు అందలేదు. దీంతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానం టికెట్లు బుక్‌ చేశారు. ఒక్కో టికెట్ ధర రూ.3800. హైదరాబాద్‌ నుంచి హనుమకొండ రావడానికి క్యాబ్‌కు మరో రూ.4వేల  ఖర్చయ్యింది. వరంగల్‌లోనే విమానాశ్రయం ఉంటే తమ సమయం, ఖర్చు ఆదా అయ్యేదని నేరుగా తిరుపతికి వెళ్లొచ్చేవారిమని శ్రీజ అభిప్రాయపడ్డారు.
ప్రధాని హెలికాప్టర్‌తోపాటు మరో మూడు రక్షణ హెలికాప్టర్లు వెంట వస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌ నిర్మాణం మామునూరులో తప్ప మరెక్కడా సాధ్యమయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో అధికారులు హెలిప్యాడ్‌లను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఎక్కడెక్కడికి వెళ్తున్నారంటే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లావాసులు ఎక్కువగా విమానాల్లో తిరుపతి, బెంగళూరు, చెన్నయ్‌, దిల్లీ, పుణె, ముంబయి, వారణాసి, శిరిడి, విశాఖపట్నం, గోవా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అయ్యప్ప మాలధారణ సమయంలో వేలాది మంది భక్తులు కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాలకు బుక్‌ చేసుకొని శబరిమల వెళ్లొస్తున్నారు. ఇక రామప్ప, లక్నవరం, వేయిస్తంభాల గుడికి వచ్చే విదేశీ యాత్రికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.

భూసేకరణ చేపట్టాలి

నిజాం కాలంలో కూడా వాయుదూత్‌ విమానాలు మామునూరులో నడిచాయి. ఇప్పటికీ రన్‌వే ఉంది. ఈ విమానాశ్రయం 31 ఏళ్ల నుంచి వృథాగా ఉంటోంది. 775 ఎకరాల స్థలంలో వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న ఈ విమానాశ్రయం పునరుద్ధరణపై పదేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది. విమానాశ్రయం పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే 1200 ఎకరాల భూమి అవసరం. మరో 425 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే పూర్తి స్థాయిలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు చెప్పారు. రెవెన్యూ అధికారులు 185 ఎకరాల భూ సేకరణ చేసి సిద్ధంగా ఉంచారు. మరో 240 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.

ఏజెన్సీల ద్వారా 9 వేల టికెట్లు

దేశంలోని అనేక ముఖ్య నగరాలు, పుణ్యక్షేత్రాలకు తరచూ ఓరుగల్లు వారు ప్రయాణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు ఇలా అనేక వర్గాల వారు నిత్యం విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి తాము టికెట్లు బుక్‌ చేస్తున్నట్టు ట్రావెల్‌ ఏజెంట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ట్రావెల్‌ ఏజెన్సీలు 32 వరకు ఉన్నాయి.వీటి ద్వారా  ఏటా 9 వేల విమాన టికెట్లు బుక్‌ అవుతున్నట్టు అంచనా.  మరోవైపు ఏజెన్సీ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఎక్కువ మంది టికెట్లు తీసుకుంటున్నారు. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటైతే  కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాలు, గ్రామాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య మరింత పెరుగుతుంది.

పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు

సోమ పుల్లయ్య, ట్రావెల్‌ ఏజెంట్, వరంగల్‌

వరంగల్‌ వాసులు హైదరాబాద్‌ నుంచి దిల్లీ, బెంగుళూర్‌, చెన్నై, కొల్‌కతా, గోవా, తిరుపతి వంటి ప్రదేశాలకు విమాన టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. నేను నెలకు వివిధ ప్రాంతాలకు 150 నుంచి 180 మంది ప్రయాణికులకు విమాన టికెట్లు బుక్‌ చేస్తుంటాను.

సంక్షిప్తంగా..

* 1970-77 మధ్య వాయిదూత్‌ విమానాలు నడిచాయి

* 2007లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం.. విమానాశ్రయం అభివృద్ధి కోసం విద్యుత్తు, నీరు, రోడ్లు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంది.

* 2007-08లో వరంగల్‌, కడప విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ.6 కోట్లు మంజూరయ్యాయి.

* 2008లో మామునూరు విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు సందర్శించారు.

* 2008-09లో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, వరంగల్‌ విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ.59 కోట్లు మంజూరు చేసింది.

* 1992 మంత్రి పీవీ రంగారావు చొరవతో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వారానికి ఒక రోజు సర్వీసులు నడిచాయి.

* రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లను నడిపించారు.

* 2021 - మామునూరులో పౌర విమాన శాఖ అధికారులు మట్టి నమూనాలు సేకరించారు.

గతంలో వీరు ఇక్కడే దిగారు

30 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్‌ జిల్లాలోని మామునూరు విమానాశ్రయంలో దిగుతున్నారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఇక్కడే దిగారు.

అన్ని విధాలుగా మేలు..

మార్త సంతోష్‌, ఐటీ ఉద్యోగి, హనుమకొండ

మాది హనుమకొండలోని హంటర్‌రోడ్డు. పదేళ్లుగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా. కుటుంబసభ్యులు ఓరుగల్లులో ఉంటారు. ఉద్యోగ రీత్యా బెంగళూరు నుంచి ప్రతి నెల వచ్చి వెళుతుంటా.. వరంగల్‌ నుంచి బెంగళూరుకు బస్సులో వెళ్లడంతో సమయం వృథా అవుతోంది. విమానం ఉంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. త్వరగా వచ్చివెళ్లొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు