logo

వచ్చేది జీరో బిల్లు.. ఇంటింటా వెలుగు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రేషన్‌కార్డు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందనుంది. ఫిబ్రవరిలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి మార్చిలో అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు.

Updated : 28 Feb 2024 08:26 IST

ఇప్పటి వరకు అర్హులు 3.75 లక్షల మంది
పెరగనున్న లబ్ధిదారులు
ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, వడ్డేపల్లి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రేషన్‌కార్డు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందనుంది. ఫిబ్రవరిలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి మార్చిలో అర్హులైన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తారు. ఇందుకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఉత్తర విద్యుత్తు పంపిణీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌పీడీసీఎల్‌) అధికారులు రేషన్‌ కార్డు, ఆధార్‌, యూనిక్‌ సర్వీస్‌ నెంబరు (యూఎస్‌నెం), చరవాణి నెంబర్ల సమాచారం సేకరించి అర్హులను గుర్తించారు. గృహజ్యోతి పథకం ప్రారంభంతో అర్హులైన లబ్ధిదారుల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తోంది.

ఎవరికి వర్తిస్తుందంటే..

ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11,60,999 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు లేనివారూ ఉన్నారు. గృహజ్యోతి పథకానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసి నిబంధనల ప్రకారం విద్యుత్తు అధికారులు అడిగినట్లుగా ఇప్పటి వరకు వివరాలు ఇచ్చిన వారు 3,75,683 మంది వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరిలో 200 యూనిట్ల విద్యుత్తును వాడుకున్న వారికి మార్చి 1 నుంచి 15 వరకు రీడింగ్‌ తీసేవారు జీరో బిల్లు ఇస్తారు. బిల్లుపై జీరోతో పాటు ఎంత బిల్లు వచ్చిందనేది కూడా కనిపిస్తుంది. లబ్ధిదారులు మాత్రం బిల్లు చెల్లించనక్కరలేదు. ఇంకా అర్హుల సంఖ్య పెరగనుందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.

200 యూనిట్లు దాటితేనే..

అధికారులు గుర్తించిన లబ్ధిదారులు 200 యూనిట్ల కంటే ఒక యూనిట్‌ అధికంగా వాడుకుంటే వారు తప్పనిసరిగా బిల్లు చెల్లించాల్సిందే. వారికి ఇచ్చే బిల్లులో జీరో బిల్లు రాదు.

వివరాలు ఇవ్వండి..

ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారు, చేయని వారు తమకు రేషన్‌కార్డు ఉంటే వెంటనే మీ ఆధార్‌, రేషన్‌కార్డు, యూనిక్‌ సర్వీస్‌ నెంబర్‌, చరవాణి నెంబర్‌ వివరాలను మీ పరిధిలో ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఇవ్వాలి. వారు వాటిని ఆన్‌లైన్‌ నమోదు చేస్తారు. అలా చేస్తేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం వర్తిస్తుంది.

యజమానులూ ఆందోళన వద్దు

పట్టణాలు, నగరాల్లో ఇళ్లకు అద్దెకు ఇచ్చిన యజమానుల్లో ఆందోళన ఉంది. దాన్ని వీడండి. మీ పేరున ఉన్న గృహ కనెక్షన్‌ కిరాయిదారుల పేరున మార్పు చెందదు. కిరాయిదారులను దరఖాస్తు చేసుకోవద్దని ఒత్తిడి చేయొద్దు. వారికి రేషన్‌కార్డు ఉండి..200 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తే దరఖాస్తు చేసుకోనివ్వండి. అద్దెకు ఉన్న వారు ఇంకా చేసుకోకుంటే వెంటనే కరెంట్‌ బిల్లు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, చరవాణి నెంబర్ల వివరాలను ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాలంటూ కరెంట్‌ అధికారి ఒకరు తెలిపారు.

కొత్త కనెక్షన్లు పెరిగేనా..?

ఉమ్మడి జిల్లాలో 11,11,416 రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డుల ప్రకారం అంతమందికి విద్యుత్తు మీటర్లు లేవంటూ ఒక అధికారి చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో తండ్రి, తల్లి పేరున ఒక కార్డు, పెళ్లిలు అయిన వారి కుటుంబ సభ్యుల పేరు మరో ఒక కార్డు ఉంటుంది. వారు ఒకే ఇంటి ఆవరణలో వేర్వేరుగా ఉంటున్నా.. ఒకే విద్యుత్తు మీటరును వినియోగిస్తారు. ఇలా ఉమ్మడి జిల్లాలో చాలా కుటుంబాలున్నాయి. వీరందరూ ఒకరి పేరునే దరఖాస్తు చేసుకోవాలి. మునుముందు వారికి విద్యుత్తు వినియోగం పెరిగి 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించే పరిస్థితులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి తెలిసిన కొంత మంది కొత్త మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


సంతోషంగా ఉంది..

కరెంట్‌ బిల్లు చూపిస్తున్న ఈయన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటకు చెందిన ఇ.వెంకన్న. వీరిది వ్యవసాయ కుటుంబం. జనవరిలో 40 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకున్నారు. అందుకు రూ.130 బిల్లు వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. గత బిల్లు ప్రకారం ఫిబ్రవరిలో వాడుకున్న కరెంట్‌కు జీరో బిల్లు రానుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు