logo

మార్కెట్‌లో బంద్‌.. బయట దందా ఆగేనా..?

జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేశారని అన్నదాతలు ఆందోళన చేసిన విషయంలో మార్కెట్‌ కార్యదర్శికి, వ్యాపారులకు అదనపు కలెక్టర్‌ నోటీసులు అందజేసిన విషయం విదితమే.

Published : 13 Apr 2024 03:12 IST

జనగామ మార్కెట్‌ ఆవరణలోని పత్తియార్డులో.. బయటి వ్యాపారుల ధాన్యం..

జనగామ, న్యూస్‌టుడే: జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేశారని అన్నదాతలు ఆందోళన చేసిన విషయంలో మార్కెట్‌ కార్యదర్శికి, వ్యాపారులకు అదనపు కలెక్టర్‌ నోటీసులు అందజేసిన విషయం విదితమే. అయినా ప్రైవేటు  కొనుగోలు దారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 17 శాతం తేమ నిబంధన, తాలు, మట్టి లేకుండా ఉండాలనే నిబంధనల నేపథ్యంలో అన్నదాతలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని చిల్లర కాంటాల దందా చేసేవారు, గ్రామాల్లో కొనుగోలుదారులు, కొన్ని చోట్ల మిల్లుల్లో నేరుగా ఖరీదు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ జరిగే మార్కెట్‌లోనే న్యాయం జరగడం లేదని రైతులు ఆందోళన బాట పడుతున్నారు.

ఇష్టారాజ్యంగా దళారులు..

మార్కెటింగ్‌ చట్టం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ లైసెన్సు ఉన్న వ్యాపారులు యార్డులోనే ఖరీదు చేయాలి. కానీ జనగామ మార్కెట్‌ చుట్టూ దళారులు అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.  తక్కువ ధరకు కొని, మార్కెట్లోనే ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న విమర్శలున్నాయి. కింది స్థాయి అధికారుల చలవతోనే ఈ వ్యవహారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.

మిల్లుల్లోనూ

జిల్లాలోని పలు మండలాల పరిధిలో, పట్టణ శివారులో ఉన్న మిల్లుల వద్ద ధాన్యం ఖరీదు జరుగుతోంది. ఓ మోస్తరు నాణ్యమైన ధాన్యాన్ని క్వింటా రూ.1800 నుంచి రూ.1900 ధరతో కొంటున్నారు. మార్కెట్‌ ట్రేడ్‌ లైసెన్సు ఉన్నా, యార్డులో కొనడానికి రాని వ్యాపారులు బయట మాత్రం జోరుగా ఖరీదు చేస్తుండటంతో మతలబు ఉందంటున్నారు. బయట తరుగు పేరిట 2 కిలోల కోత, ట్రాక్టర్‌ లోడుకు అదనంగా 35కిలోలు, కూలీ ఖర్చుల పేరిట బస్తాకు రూ.10 వసూలు చేస్తున్నారన్న అపవాద ఉంది. వెంటనే చెక్‌ ఇస్తే నూటికి రూ.2 కమిషన్‌ తీసుకుంటున్నారు. మార్కెట్లో క్రయ, విక్రయాల రికార్డు ఉంటుంది. కానీ చిల్లర కాంటాలు, మిల్లుల్లో కొనుగోళ్ల వివరాలు వెంటనే మార్కెట్‌కు ఇవ్వడం లేదు. ఈ కొనుగోళ్లపై నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో వివరాలు బయటకు వస్తాయా అనేది సందేహమే. సీఎంఆర్‌ బకాయిలను పూర్తి చేసేందుకు ఈ దందా జరుగుతోందని, ఇదంతా అధికారులకు తెల్సినా పట్టించుకోవడం లేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వ్యాపారులపై కేసుల అంశం, ఇతర సమస్యలు తేలేవరకు మార్కెట్లో కొనుగోళ్ల బంద్‌కు ట్రేడర్స్‌ అసోసియేషన్‌ నోటీసు ఇచ్చింది. ఇదే అదనుగా అక్రమ వ్యాపారం ఊపందుకునే ప్రమాదం ఉంది. అక్రమ ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేంద్ర, మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ల దృష్టికి ‘న్యూస్‌టుడే’ తీసుకువెళ్లగా ఈ అంశంపై పరిశీలించి కట్టడి చేస్తామన్నారు. ఖరీదుదారులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వారితో శనివారం చర్చల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని