logo

మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. రెండు కాళ్లు ఛిద్రం

చేపలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న మహిళ రెండు కాళ్లు రెప్పపాటులో జరిగిన సంఘటనతో నుజ్జు నుజ్జు అయ్యాయి. కుటుంబ పోషణలో భర్తకు చేదోడుగా ఉంటున్న ఆమెకు రెండు కాళ్లు లేకుండా పోయాయి.

Published : 13 Apr 2024 03:21 IST

ప్రమాదంలో నుజ్జయిన కాళ్లు

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : చేపలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న మహిళ రెండు కాళ్లు రెప్పపాటులో జరిగిన సంఘటనతో నుజ్జు నుజ్జు అయ్యాయి. కుటుంబ పోషణలో భర్తకు చేదోడుగా ఉంటున్న ఆమెకు రెండు కాళ్లు లేకుండా పోయాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఐరబోయిన రమేశ్‌ గ్రామంలో నీరటిగా చిరుద్యోగం చేస్తున్నారు. భార్య ఐరబోయిన రాజమ్మ (47) నిత్యం శాయంపేట నుంచి హనుమకొండకు వచ్చి నగరంలో చేపలు అమ్ముతూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. కుమార్తెకు పెళ్లి చేయగా.. కుమారుడు కూడా చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాజమ్మ గ్రామం నుంచి చేపలు తెచ్చి అమ్ముకొని గ్రామానికి వెళ్లేందుకు మధ్యాహ్నం  హనుమకొండ బస్టాండుకు వచ్చారు. కరీంనగర్‌ వైపు వెళ్లే బస్సులు ఆగే స్టాప్‌ నుంచి  ప్లాట్‌ఫాం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. వేములవాడ నుంచి వరంగల్‌ వెళ్లే ఆర్టీసీ డీలక్స్‌ బస్సు ఆమెను ఢీకొట్టింది. ప్రయాణికులు పెద్దగా కేకలు వేస్తుండగానే బస్సు ముందు చక్రం ఆమె రెండు కాళ్ల మీదుగా వెళ్లింది. కాళ్లు పూర్తిగా నుజ్జు నుజ్జు కావడంతో నొప్పికి తట్టుకోలేక ఆమె పెట్టిన అరుపులు స్థానికులను కలిచివేశాయి.  ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహన సిబ్బంది అక్కడికొచ్చి ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాళ్ల తొలగింపు

ఎంజీఎం ఆసుపత్రి : ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో రెండుకాళ్లు బస్సు టైరు కింద పడటం వల్ల నరాలు, కీళ్లు, ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ చేసి అతికించడానికి ప్రయత్నించినా.. వీలుకాకపోవడంతో దెబ్బతిన్న రెండు కాళ్లను తొలగించినట్లు ఎంజీఎం ఆసుపత్రి ఆర్‌ఎంవో-3 డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని