logo

అంగన్‌వాడీకెళ్తే బతికేవాడివి బిడ్డా..

వివాహ వేడుకలో బంధువులతో ఆనందంగా గడిపిన తండ్రీకొడుకులను తిరుగుప్రయాణంలో మాటేసిన మృత్యువు కర్కశంగా చిదిమేసింది.

Published : 21 Apr 2024 06:44 IST

రహదారి ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం

హరీష్‌, అశ్విత్‌తేజ్‌ (పాతచిత్రాలు)

వివాహ వేడుకలో బంధువులతో ఆనందంగా గడిపిన తండ్రీకొడుకులను తిరుగుప్రయాణంలో మాటేసిన మృత్యువు కర్కశంగా చిదిమేసింది. వెంటనే వచ్చేస్తాం అంటూ చెప్పిన వారిని విధి అందనంత దూరం తీసుకెళ్లిపోయింది. ఈ పిడుగు లాంటి వార్త వినగానే ఇంటి వద్ద భార్య, పెళ్లి వేడుకల్లో ఉన్న బంధువులు గుండెలవిసేలా రోదించారు. వేడుకకు రాకపోయినా బతికే వారు కదా అని బంధువులు.. ఇంటి వద్ద ఉంటే కొడుకు అంగన్‌వాడీ కేంద్రానికి, భర్త పనికి వెళ్లేవారని భార్య విలపించిన తీరు తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 

తొర్రూరు, చిన్నగూడూరు, న్యూస్‌టుడే

ఇంటి వద్ద విలపిస్తున్న తల్లి గౌతమి

హబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జక్కుల హరీష్‌ (28)  వ్యవసాయం చేస్తూ ట్రాక్టరు నడుపుతుండేవారు. ఆయనకు భార్య గౌతమి, కుమారుడు ఆశ్విత్‌తేజ్‌ (5) ఉన్నారు. అశ్విత్‌ గ్రామంలోని అంగన్‌వాడీలో చదువుకుంటున్నారు. శనివారం ఉదయం హరీష్‌ గ్రామంలోని ఉపాధిహామీ పనికి వెళ్లొచ్చారు. తొర్రూరులో బంధువుల వివాహ రిసెప్షన్‌ ఉండడంతో ఉదయం 10.45 గంటలకు తన కుమారుడిని తీసుకొని ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెళ్లారు. ఆ వేడుకకు వచ్చిన బంధువులతో సంతోషంగా గడిపి.. అందరితో కలిసి ఫొటోలు దిగారు.  భోజనం చేశాక ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో తొర్రూరు మాటేడు శివారులోని మూలమలుపు వద్ద ఖమ్మం నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న ప్రైవేట్ అద్దె పెళ్లి బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్‌తోపాటు అశ్విత్‌తేజ్‌ ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  స్థానిక ఎస్సై జగదీష్‌  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మంకు చెందిన శ్రీశ్రీ ట్రావెల్స్‌ బస్సుగా గుర్తించామని, డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.

సంఘటన స్థలంలో మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

అశ్విత్‌తేజ్‌ స్థానిక అంగన్‌వాడీలో ప్రీ స్కూల్‌ విద్యార్థి.  బడికి వస్తే బతికేవాడివి కదా అని టీచర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలుడు తన తాత మల్లయ్యతో కలిసి ఇన్‌స్టాగ్రాం రీల్స్‌ చేస్తుంటే ఇరుగుపొరుగు వారు ఆసక్తిగా చూసేవారని స్థానికులు చెబుతున్నారు. మనువడు మృతి చెందడంతో తనతో కలిసి వీడియోలు ఎవరు చేస్తారని తాత గుండెలవిసేలా రోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని