logo

మిల్లర్ల మాయాజాలం...!

ఉమ్మడి జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ కింద సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. సీఎంఆర్‌ సొమ్ముతో దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద రూ.819 కోట్ల విలువ చేసే బియ్యం ఉంది.

Updated : 22 Apr 2024 05:46 IST

బియ్యం బకాయిలు రూ. 819 కోట్లు
సీఎంఆర్‌ సొమ్ముతో వ్యాపారాలు

ఉమ్మడి జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ కింద సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. సీఎంఆర్‌ సొమ్ముతో దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద రూ.819 కోట్ల విలువ చేసే బియ్యం ఉంది. వీటిని ఈనెల 30వ తేదీ వరకే ఎఫ్‌సీఐకి అందించాలి. అలాంటిది నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 24.97 శాతం బియ్యమే అందించారు. ఇంకా 75.03 శాతం ఇవ్వాల్సి ఉంది. బకాయిపడిన బియ్యాన్ని రాబట్టడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో గత మూడు రోజులుగా కాజీపేట ఎఫ్‌సీఐకి లారీలు వరసకడుతున్నాయి.

న్యూస్‌టుడే, కాజీపేట: ఒక వైపు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నా కస్టమ్‌ మిల్లర్ల వరస మారడం లేదు. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి వాటిని మరాడించడానికి మిల్లర్లకు అందిస్తాయి. నిర్ణయించిన సమయానికి మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించాలి. ఇక్కడే వారు మొరాయిస్తున్నారు. అనేక కారణాలను చెబుతూ నిర్ణయించిన చివరి తేదీని వాయిదాలు వేయించుకుంటారు. దీనికి రాజకీయంగానూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తారు. వెరసి  ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఈ తంతు సాగుతుంది.

హనుమకొండ బాయిల్డ్‌ మిల్లర్లు భేష్‌..

హనుమకొండలో చాలా మంది కస్టమ్‌ మిల్లర్లు బియ్యం అందించడంలో వెనుకపడి ఉన్నా బాయిల్డ్‌ రైస్‌ అందించే మిల్లర్లు మాత్రం ముందంజలో ఉన్నారు. వీరికి ఇచ్చిన లక్ష్యాన్ని ఇప్పటికే పూర్తి చేసి మరిన్ని బాయిల్డ్‌ రైస్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల వీరు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఏం చేస్తారంటే..

ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని మరాడించి కొందరు మిల్లర్లు బయటి మార్కెట్‌లో ఎక్కువ మొత్తానికి విక్రయిస్తారు. మరికొందరు ఎక్కువ ధర ఉన్న ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తారు. ఇలా వచ్చిన సొమ్ముతో వడ్డీ వ్యాపారం లేదా రియల్‌ ఎస్టేటు, లేదా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి  6 నుంచి 8 నెలల పాటు వారి వద్దే పెట్టుకుంటారు. బయటి మార్కెట్‌లో ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకుని ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు లభించే బియ్యం తీసుకొచ్చి ఎఫ్‌సీఐకి అందిస్తున్నారు. బియ్యం ధరలో తేడా వారికి రూ.కోట్లు కురిపిస్తోంది.

ప్రభుత్వానికి వడ్డీ భయం

కస్టమ్‌ మిల్లర్ల నుంచి బియ్యం వీలైనంత త్వరగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడానికి కారణం వడ్డీ చెల్లింపులు. ముందుగా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మరాడించి తిరిగి ఇవ్వడానికి పట్టె సమయానికి (2 నెలలు) కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ చెల్లిస్తుంది. సకాలంలో తిరిగి చెల్లించని (ఈనెల 30 వరకు చివరి తేదీ) పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ భారాన్ని భరించలేక కస్టమ్‌ మిల్లర్ల నుంచి సకాలంలో తీసుకోవాలని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అయినా కొందరు మిల్లర్లు రాజకీయ అండతో తాము అనుకున్నప్పుడే బియ్యం అందజేస్తారు.

ఇదీ పరిస్థితి..

  • గత వానాకాలం చివరలో సేకరించిన ధాన్యాన్ని మరాడించిన కొందరు మిల్లర్లు ఒక్క గింజ కూడా ఇప్పటి వరకు ఎఫ్‌సీఐకి అందించలేదు. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 16 మంది మిల్లర్లు ఇంకా స్పందించలేదని తేలింది. వీరి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌ జిల్లాలో 34.666 మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి ఇప్పటి వరకు 5059 మె.ట.మాత్రమే (14.5 శాతం) తిరిగి అందించి అందరి కంటే వెనుకబడి ఉన్నారు. గతంలో ఇక్కడి మిల్లర్ల తీరును అధికారులు గమనించి మహబూబాబాద్‌లో పండిన పంటలో కొంత భాగం హనుమకొండ జిల్లా మిల్లర్లచేత మరాడించారు. అయినా వారి తీరు మారడం లేదు.
  •  అందరి కంటే జనగామ జిల్లా మిల్లర్లు కొంత ముందంజలో ఉన్నారు. వీరు ఇప్పటి వరకు 40.83 శాతం బియ్యం  అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని