logo

రహదారి ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రహదారి ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో ఈ హృదయ విదారక ఘటన ఆదివారం జరిగింది.

Published : 22 Apr 2024 02:50 IST

రెండు కుటుంబాల్లో విషాదం

సంఘటనాస్థలిలో ప్రజలు

డోర్నకల్‌, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో ఈ హృదయ విదారక ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం రూరల్‌ మండలం ఆరెకోడుతండాకి చెందిన బానోతు మోహన్‌ (47) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెంలో తమ బంధువుల ఇంట్లో జరిగే దైవకార్యక్రమానికి భార్య పార్వతి, కుమార్తె అనూషతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మరో నాలుగు కి.మీ., వెళితే గమ్యం చేరేవారు. మరోవైపు డోర్నకల్‌ మండలం వెన్నారం గ్రామశివారు రామకుంటతండాకు చెందిన తేజావతు జస్వంత్‌ (23) తన పెద్దనాన్న కూతురి వివాహ రిసెప్షన్‌కు వెళ్లేందుకు డోర్నకల్‌లో నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ద్విచక్రవాహనంపై సమీప బంధువు మంగీలాల్‌తో కలిసి వస్తున్నారు. డోర్నకల్‌లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో బానోతు మోహన్‌ ద్విచక్రవాహనాన్ని వీరు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బానోతు మోహన్‌ (47), తేజావతు జస్వంత్‌ (23) మృతి చెందారు. మంగీలాల్‌, పార్వతి, అనూష గాయపడ్డారు. వీరిలో మంగీలాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. అదే సమయంలో అటు వైపునకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో వస్తున్న ఎస్సై తిరుపతి సహాయక చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్‌ సర్వర్‌ పాష ముగ్గురికి సీపీఆర్‌ చేశారు. 108 వాహనంలో మహబూబాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకుని బర్లగూడెం, ఆరెకోడుతండా, రామకుంటతండాలో విషాదం అలుముకుంది. మృతదేహాలకు మహబూబాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. డోర్నకల్‌ సీఐ ఉపేందర్‌రావు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎదురుగా వచ్చిన వాహనఛోదకుడి నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని మృతుడు మోహన్‌ భార్య పార్వతి డోర్నకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఆ మార్గంలోనే వెళ్లి..: ఈ ప్రమాదం జరిగిన మార్గం గుండానే తేజావతు జస్వంత్‌ పెద్దనాన్న కూతురి వివాహ రిసెప్షన్‌కు ప్రమాదస్థలిని దాటి వెళ్లారే తప్ప అక్కడ బాధితులు తమ సమీప బంధువులేనని గమనించలేకపోయారు. తీరా రామకుంటతండాకు చేరినవారంతా ఈ విషయం తెలుసుకొని బోరున విలపిస్తూ పరిచయస్థులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. మానుకోట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసి కొందరు ఆక్కడికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని