logo

జిల్లాలో అకాల వర్షం!

జిల్లాలోని పలు చోట్ల ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Published : 22 Apr 2024 02:51 IST

బేతోలు గ్రామంలో పడిపోయిన ఇంటి రేకులు,

మహబూబాబాద్‌ టౌన్‌, నెహ్రూసెంటర్‌, డోర్నకల్‌, కురవి, గార్ల, బయ్యారం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు చోట్ల ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ పట్టణంలోని కృష్ణకాలనీ, బీసీ కాలనీ, శనిగపురంతో పాటు పట్టణంలోని పాత, కొత్త బజార్‌లోని పలు కాలనీల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. పలు కాలనీల్లో గంటపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. బేతోలు గ్రామ పరిసర ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. పట్టణంలోని బీసీ కాలనీలో ఓ ఇంట్లో చెట్టుపై పిడుగు పడింది. శనిగపురం, ముడుపుగల్‌, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడలో పిడుగుపాటుతో ఓ చెట్టుకు మంటలు అంటుకున్నాయి. కురవి మండలంలోని పలు గ్రామాల్లో రాళ్ల వర్షం కురిసింది. తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో చెట్టు విరిగి పడి విద్యుత్తు తీగలు తెగాయి. అక్కడే ఉన్న యువకుడు లక్ష్మణ్‌కు గాయాలయ్యాయి. వెంటనే మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. గార్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.  మామిడికాయలు రాలి రైతులకు నష్టం వాటిల్లింది. బయ్యారంలోని ఇల్లెందు, మహబూబాబాద్‌ ప్రధాన రహదారిలో కొన్ని చెట్లు నేలకూలాయి. సత్యనారాయణపురంలో మోటూరి రాధాకృష్ణమూర్తి ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు