logo

సొంతింటి కల నెరవేరుస్తాం..

కార్మికులకు సొంతింటి కల నెరవేరుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం  సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌ (ఐఎన్టీయూసీ) మహాసభ నిర్వహించారు.

Published : 22 Apr 2024 02:52 IST

మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు, చిత్రంలో ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌, వినోద్‌, వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తదితరులు

గోదావరిఖని, న్యూస్‌టుడే : కార్మికులకు సొంతింటి కల నెరవేరుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం  సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌ (ఐఎన్టీయూసీ) మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌, ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌, వివేక్‌వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావుతో పాటు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణలు హాజరయ్యారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన మహాసభకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా భారాసను మట్టికరిపించారో అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లో తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక చట్టాలను రద్దు చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని, కార్మికుల్లోకి ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుతో పాటు కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, సౌకర్యాలు పెరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఆదాయ పన్ను విషయంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని, సింగరేణి కార్మికులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ వేతనాలు అమలు చేసేందుకు కృషి చేస్తామని, విశ్రాంత కార్మికుల పింఛను పెరుగుదలకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ అనిల్‌కుమార్‌, ఐఎన్టీయూసీ నాయకులు ఎస్‌.నర్సింహారెడ్డి, పి.ధర్మపురి, త్యాగరాజన్‌, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే కార్మికుల హక్కులకు రక్షణ : దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే కార్మికుల హక్కులు కాపాడుకోగలమని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని జాతీయ స్థాయిలో ఐఎన్టీయూసీ ప్రత్యేక తీర్మానం చేసిందన్నారు. దానికి అనుగుణంగా ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. భాజపా ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని నష్టం చేసిందని, మళ్లీ అధికారంలోకి వస్తే కార్మికులకు స్వేచ్ఛ లేకుండా పోతుందన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు