logo

అధికారుల గుండెల్లో గుబులు

భూపాలపల్లి సమీపంలోని కొంపెల్లి శివారులో రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాల అటవీ భూములకు సుప్రీం కోర్టు తీర్పుతో కబ్జాదారుల కబంద హస్తాల నుంచి విముక్తి కలిగింది.

Published : 22 Apr 2024 02:54 IST

అటవీ భూముల కబ్జాకు సహకరించిన వారిపై ఆరా!

కొంపెల్లి శివారులోని అటవీ భూములు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి- న్యూస్‌టుడే, భూపాలపల్లి: భూపాలపల్లి సమీపంలోని కొంపెల్లి శివారులో రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాల అటవీ భూములకు సుప్రీం కోర్టు తీర్పుతో కబ్జాదారుల కబంద హస్తాల నుంచి విముక్తి కలిగింది. ఆక్రమణకు యత్నించిన వ్యక్తులకు సహకరించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించిన వారిపై, ఈ అటవీ భూముల వ్యవహారంలో ఎవరెవరున్నారో తెలుసుకునేందుకు పోలీసు నిఘా విభాగం రహస్యంగా విచారణ చేపట్టినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

విశ్వ ప్రయత్నాలు

కొంపెల్లి గ్రామ శివారులో సర్వే నెంబరు 171లోని 106.34 ఎకరాలు అటవీ శాఖకు చెందినవని ఈ నెల 18న అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. అటవీ భూముల స్వాధీనం కోసం కొంత మంది రెవెన్యూ అధికారుల అండదండలతోనే భూస్వాముల వారసుల పేరుతో అటవీ భూములను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేపట్టారు. 2021లో హైకోర్టు నుంచి ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు రావడంతో అటవీ భూములను స్వాధీనం చేసేందుకు వాహనాలతో చదును చేశారు. అటవీ అధికారులు అడ్డుకుని సుప్రీం కోర్టుకు వెళ్లగా అటవీ శాఖకు చెందిన భూమిగా తీర్పు వెలువడటంతో అటవీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇంటలిజెన్స్‌ అధికారుల విచారణ..?

రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ భూముల వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఇంటలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కుట్రపూరిత అఫిడవిట్లు సమర్పించిన అధికారులు, రికార్డులు తారుమారు చేసిన వారు, కబ్జాదారులకు అనుకూలంగా నివేదికలు తయారు చేసిన వారు ఎవరున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. అదేవిధంగా ఎవరైనా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా.. ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టు వరకు వెళ్లడానికి పెట్టుబడి పెట్టిన వారెవరు..? అనే కోణంలో ఇంటలిజెన్స్‌ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దీంతో భూ దందాకు సహకరించిన అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. రెవెన్యూ శాఖలోని ఇద్దరు, ముగ్గురు ఉన్నతాధికారుల సహకారంతో సదరు భూస్వామి వారసుల పేర్లతో అవసరమైన రికార్డులు సృష్టించుకుని కబ్జా చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయి అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ప్రెవేటు వ్యక్తి తనకు అనుకూలమైన అధికారులను కూడా ఇక్కడికి రప్పించుకున్నట్లు సమాచారం. వారే నివేదికలు తయారుచేసి మార్గాన్ని సుగమం చేశారు.

సర్వేను బహిష్కరించిన అటవీ అధికారులు

నాలుగేళ్ల క్రితం ఇవే అటవీ శాఖ భూములను జాయింట్‌ సర్వే చేయడానికి అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. అప్పటి డీఎఫ్‌వో జాయింట్‌ సర్వేకు అటవీ అధికారులను హాజరుకానివ్వలేదు. ఎన్నో ఏళ్ల నుంచి అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూములకు తాము ఎందుకు జాయింట్‌ సర్వేకు వస్తామని అటవీ అధికారులు బహిష్కరించడంతో అప్పటి కలెక్టర్‌ డీఎఫ్‌వోపై సీరియస్‌ అయినట్లు సమాచారం. దీంతో ఏకపక్షంగా రెవెన్యూ అధికారులే సర్వే నిర్వహించారని అటవీ అధికారులు అప్పట్లో ఆరోపించారు. 106.34 ఎకరాల అటవీ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు సహకరించిన విషయంలో మాజీ ప్రజాప్రతినిధులు, మరికొంత మంది పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని