logo

అమృత్‌ భారత్‌ నిధులతో కొత్త హంగులు

దేశంలోని పలు రైల్వేస్టేషన్లను అత్యంత సుందరీకరణతో అధునాతన వసతులు చేపట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమృత్‌భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకం మంజూరు చేసింది.

Published : 22 Apr 2024 02:56 IST

జనగామ రైల్వేస్టేషన్‌

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: దేశంలోని పలు రైల్వేస్టేషన్లను అత్యంత సుందరీకరణతో అధునాతన వసతులు చేపట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమృత్‌భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకం మంజూరు చేసింది. ఈ పథకంలో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో అధునాతన రీతిలో అభివృద్ధి పనులును రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగా జనగామ రైల్వేస్టేషన్‌కు రూ.24 కోట్లను మంజూరు చేసింది. ఏడు నెలల క్రితం అప్పటి భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్టేషన్‌లో ఈ పనులను ప్రారంభించారు. రెండు దశల్లో పనులు పూర్తి చేయడానికి రైల్వే శాఖ సివిల్‌ విభాగం వారు ప్రణాళికను రూపొందించి పనులను చేపట్టారు. ఇవి పూర్తయితే స్టేషన్‌ కొత్త హంగులతో అధునాతనంగా మారనుంది.

అభివృద్ధి పనుల వివరాలు

దశాబ్దాలుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో సరైన వసతులు కరవయ్యాయి. అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకంలో  మొదటి దశ పనుల్లో భాగంగా మొదటి ప్లాట్‌ఫారంపైన ఇప్పుడున్న బుకింగ్‌ కౌంటర్‌ను మరోచోట నిర్మించనున్నారు. స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయాన్ని, రైల్వే పోలీస్‌ స్టేషన్‌ను కొత్తగా నిర్మించనున్నారు. ప్రయాణికులు వేచి ఉండే వెయిటింగ్‌ గదుల విభాగాన్ని కూడా అధునాతనంగా నిర్మించనున్నారు. రెండు ప్లాట్‌ఫారాలపై అదనంగా రేకుల షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌ పట్టణం నడిబొడ్డున ఉండటంతో ప్రజలు రాకపోకలకు పట్టాలు దాటుతున్నారు. పట్టణ ప్రజలతో పాటు ప్రయాణికులు కూడా స్టేషన్‌ బయట మొదటి ప్లాట్‌ ఫారం నుంచి రెండో ప్లాట్‌ ఫారం బయటకు వెళ్లడానికి కొత్తగా వంతెన నిర్మించనున్నారు. స్టేషన్‌ ఎదురుగా పచ్చని చెట్లు, గడ్డి ఏర్పాటు చేయడంతో పాటు వాటర్‌ ఫౌంటేన్‌ ఏర్పాటు చేయనున్నారు. నెల రోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ఏడీఆర్‌ఎం పనులను పరిశీలించి వెళ్లారు. ప్రస్తుతం రెండో ప్లాట్‌ఫాం వద్ద ఉన్న వ్యాగన్‌ పాయింట్‌ సమీపంలో మూడో ప్లాట్‌ఫాం పనులను కూడా రెండో దశలో చేపట్టనున్నారు. భవిష్యత్‌లో సికింద్రాబాద్‌ నుంచి భువనగిరి, ఆలేరు, జనగామ మీదుగా ఎంఎంటీఎస్‌ రైళ్లను పొడగించడానికి గాను మూడో లైన్‌ ఏర్పాటు ప్రతిపాదనలో ఉంది.

రైళ్ల హాల్టింగ్‌ మాటేమిటి..?

అభివృద్ధి పనులు జరుగుతున్నా కూడా ఎంతో కాలంగా కోరుతున్న పలు ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని కోరుతున్నా కూడా ఇవ్వడం లేదని ఈ ప్రాంత ప్రయాణికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా మారడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడలిగా ఉంటోంది. ఎంతో కాలం నుంచి జనగామ మీదుగా హైదరాబాద్‌కు రైళ్లల్లో అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తూ వేలాది మంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వేగంగా అభివృద్ధి జరుగుతున్న జనగామ ప్రాంత వ్యాపార వర్గాలకు కూడా రైళ్ల హాల్టింగ్‌ ఎంతో ఉపయోగపడనుంది. జనగామలో శాతవాహన, చార్మినార్‌, సింహపురి తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని