logo

జాతీయ రహదారి విస్తరణ.. ఆగుతూ సాగుతూ!

హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారి 163 విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల కిందట గుత్తేదారు పనులను ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించారు.

Updated : 22 Apr 2024 05:46 IST

దామెర మండలం ఒగ్లాపూర్‌ వద్ద అసంపూర్తిగా పనులు

హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారి 163 విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల కిందట గుత్తేదారు పనులను ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించారు. ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

పరకాల, దామెర, న్యూస్‌టుడే

ఇబ్బందులు ఇలా..

  • పనులు జరిగే ప్రదేశంలో కంకర, మొరం పోశారు. వీటిపై నీళ్లు చల్లకపోవడంతో దుమ్మూ, ధూళి లేస్తుండడంతో  ప్రయాణికులు ఇబ్బంది  పడుతున్నారు.
  • ఆరెపల్లి నుంచి గుడెప్పాడ్‌ క్రాస్‌ రోడ్డు మధ్యలో ఒగ్లాపూర్‌ బస్టాండ్‌, సైలానిబాబా దర్గా, పవర్‌గ్రిడ్‌ వద్ద కొంత మేర పనులను నిలిపివేశారు.
  • కల్వర్టుల వద్ద వంతెనలు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు.
  • ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ చెరువు వద్ద హైలెవెల్‌ వంతెన మంజూరైనా పనులను ప్రారంభించలేదు. రానున్న వర్షాకాలంలో కటాక్షపూర్‌ చెరువులో వరదనీరు చేరితే జాతీయ రహదారిపై మత్తడి ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి.
  • ఇటీవల ఊరుగొండలోని ఎస్సారెస్పీ వంతెనపై ఓ వాహనం డీజిల్‌ ట్యాంక్‌ పైప్‌లైన్‌ పగిలిపోవడంతో వంతెనపైనే నిలిచిపోయింది. దీంతో జాతీయరహదారిపై ఇరు వైపులా వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు 2 గంటల సమయం పట్టింది.
  • ఇటీవల ఒగ్లాపూర్‌ బస్టాండ్‌ వద్ద ద్విచక్రవాహనదారుడు ప్రయాణిస్తుండగా.. రహదారిపై దుమ్ము లేచి ఎదురుగా వచ్చిన రహదారి కనిపించకపోవడంతో ముందు వెళ్తున్న మరో వాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

ఆర్నెల్లలో పనులు పూర్తి చేస్తాం

చేతన్‌, ఏఈ, జాతీయ రహదారి

జాతీయ రహదారి విస్తరణ పనులు ఆర్నెల్లలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. కంఠాత్మకూరు, నీరుకుళ్ల హై లెవెల్‌ వంతెన పనులు ఇప్పట్లో పూర్తి కావు. కటాక్షాపూర్‌ చెరువు మత్తడి సమీపంలో నేరేడుపల్లికి వెళ్లే రోడ్డుకు ఇబ్బందులు కలగకుండా రీ డిజైన్‌ చేయాల్సి ఉంది. వీటికి అనుమతి కోసం దిల్లీకి ప్రతిపాదనలు పంపించాం.

పేరు: హైదరాబాద్‌- భూపాలపట్నం జాతీయ రహదారి 163

ఎక్కడి నుంచి ఎక్కడికి: హైదరాబాద్‌ నుంచి భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, హనుమకొండ, ఆత్మకూరు, మల్లంపల్లి,ములుగు, ఏటూరునాగారంతో పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని చంద్రపట్ల, భద్రకాళి పట్టణాల మీదుగా భూపాలపట్నం వరకు

కి.మీ.: 334 ప్రత్యేకత: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సులువైన రవాణా మార్గం.

  • ‘హనుమకొండ జిల్లా ఆరెపల్లి నుంచి ములుగు జిల్లా వరకు 33 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.330 కోట్లు మంజూరు చేసింది.’

నాణ్యత లోపాలు..

ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. విభాగినుల నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో ద్విచక్రవాహనాలు ఢీకొని కూలిపోతున్నాయి. ఒగ్లాపూర్‌, ఊరుగొండ వద్ద విభాగినులపై 3 నెలల క్రితం సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటికి విద్యుత్తు అందించకపోవడంతో రాత్రివేళ అంధకారం నెలకొంటోంది. పనులు జరుగుతున్న ప్రదేశాల వద్ద గుత్తేదారు ప్రమాద సూచికలను ఏర్పాటు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని