logo

భూమాతకు మాటిద్దాం... ప్లాస్టిక్‌ను తరిమేద్దాం

పంచభూతాల్లో ఒకటైన భూమిని కాపాడుకుంటేనే మానవళికి రక్ష.. అలాంటిది ప్రమాదకర ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ నివారణ మన ఇంటి నుంచే  మొదలవ్వాలి.

Updated : 22 Apr 2024 05:41 IST

మన ఇంటి నుంచే మార్పుని మొదలెడదాం

పంచభూతాల్లో ఒకటైన భూమిని కాపాడుకుంటేనే మానవళికి రక్ష.. అలాంటిది ప్రమాదకర ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ నివారణ మన ఇంటి నుంచే  మొదలవ్వాలి. ఇందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం. సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకుని ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం

న్యూస్‌టుడే, డోర్నకల్‌ : పల్లె మొదలు పట్టణం దాకా ఏ దుకాణానికి వెళ్లినా ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. వీటి వల్ల కలిగే అనర్థం అంతా ఇంతా కాదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా ఎక్కడా అమలు కావడం లేదు. షాంపు ప్యాకెట్లు, బిస్కెట్‌ కవర్లు, గుట్కా రేపర్లు తదితరాలు తిరిగి వాడేందుకు పనికి రానివి. ఫలితంగా ఇవి ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ సీసాల్లో నీరు తాగడం వల్ల దాని రేణువులు ఆహారంతో పాటు శరీరంలో చేరుతున్నాయి. ప్లాస్టిక్‌ గ్లాసుల్లో వేడి టీ, కాఫీ తాగుతున్నందున వేడితో జరిగే రసాయన చర్య వల్ల కరిగి జీర్ణాశయం లోపలికి వెళ్లి ప్రతి అవయవంపై ప్రభావం చూపుతుంటుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. జలాశయాల్లో చేపలు చనిపోతున్నాయి.

ధర్మసాగర్‌లో..

 

నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం

‘ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి 1970 ఏప్రిల్‌ 22న ధరిత్రి దినోత్సవం మొదటిసారి నిర్వహించారు. ఏటా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆమేరకు ప్రజల్లో అవగాహన కల్పించడం  ఆనవాయితీ. ఈసారి ‘ప్లానెట్‌ వర్సెస్‌ ప్లాస్టిక్‌’ పిలుపునిచ్చారు. 2040 నాటి ప్లాస్టిక్‌ వాడకాన్ని నియంత్రించడం దీని ముఖ్యోద్దేశం.’

వరంగల్‌ ముంపునకు కారణమిదే..

వరంగల్‌ నగరంలో రోజుకు 300 టన్నుల వ్యర్థాలు సేకరిస్తుండగా 70 టన్నుల ప్లాస్టిక్‌ ఉంటోంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటల్లో నాలాలు, కాలువల్లో ఇవి పేరుకుపోయి నీటి ప్రవాహం స్తంభించి పొంగుతున్నాయి. ఆవాసాలు, కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. అంటే నగర పౌరులు వారికి వారే ముంపును కొనితెచ్చుకుంటున్నారనేది అర్థమవుతోంది.

మీకు తెలుసా?

ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభా 35,12,576 మంది. పల్లెలు, పట్టణాల్లో కలిపి వీరి నుంచి రోజుకు 220 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగవుతున్నాయని ఒక అంచనా. అంటే ఏడాదికి 8.03 కోట్ల కిలోలు పోగవుతున్నాయి. సగటున ఒకరు ఏడాదికి 22.86 కిలోల ప్లాస్టిక్‌  వినియోగిస్తున్నారు.

బాధ్యత అందరిది

 • నిత్యావసర సరకులు, కూరగాయలను వస్త్ర సంచుల్లోనే తేవాలి 
 • మాంసం తెచ్చుకునేందుకు స్టీల్‌ డబ్బాలు పట్టుకెళ్లాలి.  
 • శుధ్ది చేసిన నీటి డబ్బాలు కొనుగోలు మాని, ఇంట్లో వాటర్‌ ఫిల్టర్‌ పెట్టుకుంటే సురక్షితమేగాక ఖర్చు తగ్గుతుంది 
 • బయటకు వెళ్లే సమయంలో తాగునీటికి స్టీల్‌, రాగి బాటిళ్లను తీసుకెళ్లండి.  
 • ఇంటాబయటా పానీయాలు తాగేటప్పుడు స్ట్రాల వాడకం మానేయాలి 
 • గాజు, కాగితం గ్లాసులు వాడండి 
 • కొబ్బరి నీళ్లను ప్లాస్టిక్‌ సీసాలలో పోయించి ఇంటికి తెచ్చుకోవడం కన్నా కొబ్బరి బోండాలనే నేరుగా పట్టుకెళ్లండి
 • ప్రభుత్వాలు స్పందించాలి
 • ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ కవర్ల తయారీని తొలుత నిషేధించాలి  
 • అన్ని జన సంచార ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ సేకరణ, నిర్మూలన చేసే యంత్రాలు ఉంచాలి.    
 • మేడారం జాతరలో చేపట్టిన మాదిరి అన్ని పండగలు, జాతరల వేళ ప్లాస్టిక్‌ వాడకుండా ప్రభుత్వం చైతన్యం రగిలించాలి. 
 • గ్రామాల్లో మహిళా సంఘాలతో వస్త్ర సంచులు కుట్టించి పంపిణీ చేయాలి. 
 • పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక దశలోనే ప్లాస్టిక్‌ అనర్థాల గురించి తెలపాలి 
 • కాగితం, వస్త్ర సంచుల తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ, స్వయం ఉపాధికి  రుణం అందించాలి.  
 • ప్లాస్టిక్‌ నిషేధం అన్ని పల్లెలు, పట్టణాలు, నగరాల్లో కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలి 
 • పంచాయతీల్లో ప్రతి గురువారం ప్లాస్టిక్‌ సేకరించేలా దృష్టిపెట్టాలి.  
 • వ్యాపారులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల ప్రచారంలో ఇలా చేద్దాం

 • సభలు, సమావేశాలప్పుడు బ్యానర్లు, ఫ్లెక్సీలు వస్త్రాలతో చేసినవే వినియోగించేలా చూడాలి. 
 • ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్లాస్టిక్‌ నిషేధం అమలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి.
 •  సభలు, సమావేశాల్లో ప్లాస్టిక్‌నీటి సీసాలను వినియోగించొద్దు.
 • వ్యర్థ ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ  పడేస్తున్నందున ఆవులు ప్లాస్టిక్‌తో కలుషితమైన ఆహారం తింటున్నాయి. అవిచ్చే పాలలో ప్లాస్టిక్‌ రేణువులు ఉంటుండటంతో వాటి ప్రభావం మన ఆరోగ్యాలపై పడుతోంది.

వస్త్ర సంచుల పంపిణీ 

ప్లాస్టిక్‌ని నివారిద్దాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్యోద్దేశంతో డోర్నకల్‌లో  లయన్స్‌క్లబ్‌ వస్త్ర సంచులు పంపిణీ చేస్తోంది. కూరగాయలు, కిరాణా కొనుగోలుకు  వీటిని వినియోగించాలని క్లబ్‌ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

వెంట ఉండాలి

ప్రభుదాస్‌, ఎస్జీటీ, ఎంపీపీఎస్‌, డోర్నకల్‌

ప్లాస్టిక్‌ నియంత్రణ జరగాలనేది నా ఆకాంక్ష. అందుకే పదిహేనేళ్లుగా నేను వస్త్ర సంచిని వాడుతున్నా. ఎటు వెళ్లినా వెంట వస్త్ర సంచి తీసుకెళతా. దీన్ని పాటిస్తే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని