logo

బిడ్డా.. కాపాడుకోలేకపోయాను..!

కన్న కొడుకు బావిలో పడి గిలగిలాకొట్టుకుంటుంటే కాపాడుకోవడానికి ఆ తండ్రి ప్రాణాలకు తెగించారు. బావిలోకి దిగి నీటిలో మునిగిపోతున్న కుమారుడ్ని బయటకు తీసుకొచ్చినా ప్రాణాన్ని కాపాడలేకపోయారు..

Updated : 22 Apr 2024 05:59 IST

బావిలో పడి యువ రైతు దుర్మరణం..
ఓ తండ్రి విషాదం

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: కన్న కొడుకు బావిలో పడి గిలగిలాకొట్టుకుంటుంటే కాపాడుకోవడానికి ఆ తండ్రి ప్రాణాలకు తెగించారు. బావిలోకి దిగి నీటిలో మునిగిపోతున్న కుమారుడ్ని బయటకు తీసుకొచ్చినా ప్రాణాన్ని కాపాడలేకపోయారు.. తాను చూస్తుండగానే కొడుకు మరణించాడని.. రక్షించలేకపోయానని ఆ తండ్రి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ మండలం ఉత్తరతండాలో ఆదివారం జరిగింది.  కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. ఉత్తరతండాకు చెందిన బోడ కిషన్‌- కమిలి దంపతులకు కుమారులు రమేష్‌, సురేష్‌  కుమార్తె జ్యోతి ఉన్నారు. తమకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిని  కుమారులకు రెండెకరాల చొప్పున పంచి ఇచ్చారు. వారికి సాగు పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. పెద్దకుమారుడు బోడ రమేష్‌ (35) ఆదివారం ఉదయాన్నే  వరి పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అతడి వెనుకాలే తండ్రి కిషన్‌కూడా వెళ్లి సాగు పనులు చేస్తున్నారు. విద్యుత్తు మోటారు నుంచి నీరు సరిగా రానందున రమేష్‌ పైపును సవరిస్తున్న క్రమంలో ఒక్కసారిగా మోటార్‌కు ఉన్న పైపు ఊడిపోయి ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న తండ్రి కిషన్‌ బావి వద్దకు పరుగెత్తుకు వచ్చారు. కుమారుడికి ఈత రాదని తెలిసి అతణ… కాపాడేందుకు తన పంచెను తీసి విసిరేసినా రమేష్‌ అందుకోలేకపోయారు. వెంటనే కిషన్‌ బావిలోకి దూకి కొడుకును కాపాడేందుకు ప్రయత్నించారు. నీట మునుగుతున్న అతనిని పైకి తీసుకొచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి చేతిలోనే తుదిశ్వాస విడిచారు. రమేష్‌కు భార్య  సరిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై  దీపికారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు