logo

ఎన్నికల్లో అక్రమాలా.. మీరూ అడ్డుకోండి..

లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. నామపత్రాల దాఖలు ప్రక్రియ సాగుతోంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

Published : 22 Apr 2024 03:14 IST

అందుబాటులోకి ప్రత్యేక యాప్‌లు

లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. నామపత్రాల దాఖలు ప్రక్రియ సాగుతోంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు యాప్‌లు, టోల్‌ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు మీ కోసం..

సీ-విజిల్‌ యాప్‌..

ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎంసీసీ) ఉల్లంఘిస్తే  సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల అధికారికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, అనుచరగణం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అల్లర్లకు పాల్పడినా.. డబ్బు, మద్యం, ఇతరత్రా కానుకలు పంపిణీ చేసినా.. దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారు.

సువిధ యాప్‌..

ఈ యాప్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. సింగిల్‌ విండో సిస్టమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రచార వాహనాలకు, మైకులు, సభలు, సమావేశాలకు, తదితర పలురకాల అనుమతులు పొందడానికి వీలు ఉంటుంది. ఈ యాప్‌ను వినియోగించుకుని అభ్యర్థులు ఇంటి నుంచే అనుమతులు పొందవచ్చు. సంబంధిత నోడల్‌ అధికారి, సెక్షన్‌ అధికారులు, సాంకేతిక అధికారులు అందుబాటులో ఉంటారు. దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన పత్రాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే అనుమతులు ఇస్తారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తారు. తర్వాత దరఖాస్తుదారుడు అనుమతి పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా వచ్చిన దరఖాస్తును వారు పరిశీలించి అనుమతులు ఇస్తుంటారు. ఈ యాప్‌ను కూడా ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్‌ ఇలా..

ఇంటర్నెట్‌ కలిగి ఆండ్రాయిడ్‌ ఉన్న మొబైల్‌తో గూగుల్‌ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీడియోలు, ఫొటోలు, ఆడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేటప్పుడు ఆటోమేటిక్‌గా వాటికి జియో ట్యాగింగ్‌ కూడా వస్తుంది. అధికారుల దర్యాప్తులో ఇదే కీలక సాక్ష్యం అవుతుంది. సమస్యను బట్టి పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతారు.

ఓటరు సందేహాల నివృత్తికి 1950

ఓటుకు సంబంధించిన ఏ సందేహానికైనా టోల్‌ఫ్రీ నెంబరు 1950కి ఫోన్‌ చేయొచ్చు. ఓటరు కార్డు స్టేటస్‌, ఓటు నమోదు, పోస్టల్‌ ఓటుకు సంబంధించిన వివరాలు, ఇతరత్రా సమాచారం ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు వివరాలుంటే పోలింగ్‌ కేంద్రం పరిధి కూడా తెలుసుకునే వీలుంటుంది. 24 గంటలూ ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది.

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయం

వృద్ధులు, దివ్యాంగుల కోసం ‘సక్షం ఈసీఐ’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అధికారులు ఈ వివరాలను పరిశీలించి.. దివ్యాంగులు, వృద్ధులు  పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. సహాయకుడితో పాటు మూడు చక్రాల సైౖకిళ్లను అందుబాటులో ఉంచుతారు.

పారదర్శకత కోసం మరిన్ని...

ఖానాపురం (నర్సంపేట): లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మూడు యాప్‌లు ఇటీవల అందుబాటులోకి తెచ్చింది.  ప్లే స్టోర్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకోవచ్చు.

ఓటరు జాబితాలో తప్పుల సవరణ

‘ఓటరు హెల్ప్‌లైన్‌’ యాప్‌ ద్వారా ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. తప్పుల సవరణ, ఓటు బదిలీ, ఫిర్యాదు, ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.

అభ్యర్థుల సమాచారం

నియోజకవర్గాల వారీగా ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకునేందుకు ‘నో యువర్‌ క్యాండిడేట్ (కేవైసీ)’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అభ్యర్థుల వివరాలు,  విద్యార్హతలు, నేర చరిత్ర, ఆస్తులు తదితర వివరాలు ఉంటాయి.

  • ఇటీవల భూపాలపల్లి పట్టణంలో ఓ వ్యక్తి ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సి విజిల్‌ యాప్‌నకు ఫిర్యాదు అందింది. వెంటనే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం (ఎఫ్‌ఎస్‌టీ) స్పందించి అక్కడికి వెళ్లి పరిశీలించింది. సంబంధిత వ్యక్తిని విచారించి సమస్యను పరిష్కరించారు.
  • రెండ్రోజుల కిందట హనుమకొండకు చెందిన ఓ యువతి 1950కి ఫోన్‌ చేశారు. ఆమె మార్చి నెలలో ఓటుహక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నానని.. ఓటరు గుర్తింపు(ఐడీ) కార్డు ఎప్పుడు వస్తుందని అడిగారు. ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత కార్డు పోస్టల్‌ సర్వీసు ద్వారా ఇంటివద్దకే వస్తుందని సిబ్బంది సమాధానం చెప్పారు.
  • మహబూబాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు నమోదుకు ఎప్పటి వరకు గడువు ఉందని ఇటీవల 1950కి ఫోన్‌ చేసి అడిగారు. స్పందించిన సిబ్బంది ఏప్రిల్‌ 15వ తేదీ వరకు గడువున్నట్లు సమాచారం ఇచ్చారు.
  • ఇటీవల ములుగుకు చెందిన ఓ యువకుడు పట్టణంలో పలుచోట్ల గోడలపై రాజకీయ నేతల బొమ్మలు, ప్రచార రాతలు ఉన్నాయని సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు వాటిని తొలగించారు.
  • ఓ పార్టీ తరఫున పోటీచేస్తున్న వరంగల్‌కు చెందిన అభ్యర్థి.. కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించేందుకు అనుమతులు కావాలని సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత పత్రాలను తనిఖీ చేసి రిటర్నింగ్‌ అధికారి అనుమతులు ఇచ్చారు.
  • ​​​​​​​జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాజకీయ పార్టీ ప్రచార పోస్టర్లు, నినాదాలకు సంబంధించిన బ్యానర్లు తొలగించలేదని సి విజిల్‌ యాప్‌ ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి 40 నిమిషాల్లో వాటిని తొలగించి, ఫిర్యాదుదారుడికి విషయాన్ని చేరవేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు