logo

గెలుపే లక్ష్యంగా భారాస ప్రచార వ్యూహం

విపక్ష భారాస ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు రచిస్తోంది.

Updated : 22 Apr 2024 05:36 IST

28న వరంగల్‌, మే 1న మహబూబాబాద్‌లో గులాబీ అధినేత రోడ్డుషోలు

ఈనాడు, వరంగల్‌: విపక్ష భారాస ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు రచిస్తోంది. గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రచారానికి షెడ్యూలు సైతం ఖరారైంది. ప్రత్యేకంగా బహిరంగ సభలు కాకుండా ఎన్నికల ప్రచారాన్ని రోడ్డు షోల రూపంలో నిర్వహించనున్నారు.

  • ఈ నెల 28న కేసీఆర్‌ బస్సు యాత్ర ద్వారా రోడ్డు షో నిర్వహిస్తారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు జరిగే ప్రదర్శన కోసం తగిన జనసమీకరణ చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కనీసం 50 వేల మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసంలో కేసీఆర్‌ బస చేయనున్నారు. వరంగల్‌ పశ్చిమ, తూర్పుతోపాటు, పరకాల తదితర నియోజకవర్గాల ద్వారా కేసీఆర్‌ బస్సు యాత్ర సాగేలా రూట్మ్యాప్‌ రూపొందిస్తున్నట్టు జిల్లా భారాస పార్టీ శ్రేణులు తెలిపారు.
  • మే 1న సాయంత్రం ఆరింటికి మానుకోట పట్టణంలో కేసీఆర్‌ రోడ్డు షో నిర్వహిస్తారు. ఇక్కడా భారీ జనసమీకరణకు నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు నామినేషన్‌ ర్యాలీ

బాలసముద్రం, న్యూస్‌టుడే: వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌ సోమవారం నామినేషన్‌ వేస్తారని మాజీ చీఫ్‌ విప్‌, భారాస హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. ఆదివారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలు సమర్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమ పార్టీకి అనుకూలంగా మారాయని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని భాజపాపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. అభ్యర్థి సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీలు కాజీపేట రైల్వే కోచ్‌, బయ్యారం ఉక్కు పరిశ్రమల హామీలను కేంద్రం విస్మరించిందన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భారాసకు చేసిన అన్యాయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అరూరి రమేశ్‌ను వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. చుట్టూ భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తన నామినేషన్‌ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, భాజపాలు హామీలను నెరవేర్చలేదన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. వరంగల్‌ ప్రజలు ధర్మం వైపు ఉండి సుధీర్‌కుమార్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కుడా మాజీ ఛైర్మన్లు సుందర్‌రాజ్‌ యాదవ్‌, యాదవరెడ్డి, భారాస కార్పొరేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

రేపు కేటీఆర్‌ పర్యటన..

భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ మంగళవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌ నాని గార్డెన్‌లో తూర్పు నియోజకవర్గం, హంటర్‌రోడ్డులోని డి కనెక్వన్షన్‌ హాల్‌లో వర్ధన్నపేట నియోజకవర్గం విస్తృత సమావేశాల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని