logo

‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్‌ అంతంతే!

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.

Published : 19 May 2024 04:20 IST

గణపురం మండలం చెల్పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్‌లో ప్రజలు 

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంబంధిత ఎన్నికల అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఓటు హక్కు వినియోగంలో అలసత్వం వహిస్తున్నవారు, తక్కువ శాతం పోలింగ్‌ నమోదవుతున్న పీఎస్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఓటు హక్కు ప్రాముఖ్యత తెలిసేలా పోలింగ్‌ కేంద్రాలను ఆదర్శవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఓటు హక్కు వినియోగంపై విస్తృత అవగాహన కల్పించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 317 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అందులో మహిళా, యువత, దివ్యాంగ ఇలా 9 ఆదర్శ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా ఆదర్శ కేంద్రాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది.

ఆసక్తి చూపని ఓటర్లు

భూపాలపల్లి నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారత ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు నియోజకవర్గంలో 9 ఆదర్శ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 5 మహిళా పోలింగ్‌ కేంద్రాలు, ఒక యువత పోలింగ్‌ కేంద్రం, ఒక ఆదర్శ కేంద్రం, ఒక ఆదర్శ సింగరేణి కేంద్రం, ఒక దివ్యాంగ పోలింగ్‌ కేంద్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఓటర్లను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో అన్నిరకాల మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా రెడ్‌ కార్పెట్‌ పర్చి, పోలింగ్‌ కేంద్రాల ముందు రంగురంగుల ముగ్గులు, బెలూన్లతో అలంకరించారు. ఓటు హక్కు మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ.. ఓటు ప్రాముఖ్యత తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి చూపలేదు.

 రెండు కేంద్రాల్లోనే 70 శాతం పైగా..

నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 9 ఆదర్శ కేంద్రాల్లో కేవలం మొగుళ్లపల్లి, రేగొండ మండలాల్లోనే 71 శాతం పోలింగ్‌ జరిగింది. మిగిలిన చోట్ల 60 నుంచి 50 శాతం మాత్రమే నమోదైంది. మరోవైపు భూపాలపల్లి పట్టణంలోని ఆదర్శ కేంద్రాల్లో 35 నుంచి 45 శాతం లోపే పోలింగ్‌ జరిగిందటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆసక్తి కనబరిచారు. పట్టణాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటోందని.. అక్కడ పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా అధికారులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పట్టణ ప్రజలు ఓటుకు దూరంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. సరాసరి 80 శాతం కంటే ఎక్కువ నమోదుకాగా లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి ఆదర్శ కేంద్రాల్లో చాలా తక్కువగా పోలింగ్‌ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని