logo

బడుల బాగు పనులిక చకచకా..!

ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది.

Published : 19 May 2024 05:38 IST

తెరిచేనాటికి పూర్తయ్యేలా..

మరిపెడ మండలం ఆర్లగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో ఏఏపీపీ  పనులను పరిశీలిస్తున్న డీఈఓ రామారావు (పాత చిత్రం)
న్యూస్‌టుడే, మానుకోట: ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. గతంలో మన ఊరు-మనబడి అనే పథకాన్ని చేపట్టారు. ఆ పనులను కూడా కొనసాగిస్తారు.  నూతనంగా ఏర్పాటైన  ఏఏపీపీలు పాఠశాలల చేపట్టాల్సిన పనుల తీర్మానాలతో.. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో తెరిపించిన బ్యాంకు ఖాతాలతో నిబంధనల మేరకు అవసరమైన నిధులను డ్రా చేస్తూ నిర్దేశించిన పనులను ఈ విద్యా సంవత్సరం (2024-25)లో జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ ఈ పథక పనులను సకాలంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

ఇవీ పనులు..

ముఖ్యంగా పాఠశాలల్లో శౌచాలయాలు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు, తరగతి గదుల మరమ్మతులు, చిన్నపాటి మరమ్మతు చేపడుతారు.

 ఇప్పటికే 25 శాతం నిధులతో..

జిల్లాలో ఏఏపీపీ  ఏర్పాటయిన పాఠశాలల్లో నిర్దేశిత పనులను పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే విడుదలైన  25 శాతం నిధులతో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలున్న పాఠశాలల్లో విద్యుతేకత, ఫ్యాన్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, తాగునీరు తదితర కనీస సౌకర్యాలను, సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించి ఆ మేరకు పనులు చేయించారు. అన్ని పాఠశాలల్లోనూ వివిధ పనులను చేపట్టేందుకు కృషి జరుగుతోంది.

438 పాఠశాలల్లో ప్రతిపాదనలు..

జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 922 ఉండగా వీటిల్లో ఏఏపీపీలను 440 పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఎంపికైన అన్నింటిలోనూ బ్యాంకు ఖాతాలు తెరిచారు. 438 పాఠశాలల్లో వివిధ పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వ్యయం రూ.12.42 కోట్లుగా అంచనా వేశారు. వీటిల్లో 25 నిధులను అంటే రూ.3.10 కోట్ల నిధులను విడుదల చేశారు. పనుల గ్రౌండింగ్‌ అయిన పాఠశాలల సంఖ్య తాజా సమాచారం ప్రకారం 432 ఉన్నాయి.

జిల్లా ఆధికారుల సమీక్ష

అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పర్యవేక్షణపై జిల్లా కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్, అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, జిల్లా విద్య, ఆర్‌అండ్‌బీ, సంబంధిత శాఖల అధికారులతో ఈ నెల 16న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో ఏ మేరకు పనులు గ్రౌండింగ్‌ అయ్యాయనే విషయం తెలుసుకునేందుకు మండలాల వారీగా టీంలను సిద్ధం చేసి నివేదికలను సేకరించాలని సూచించారు. చేపట్టిన పనులను పాఠశాలల ప్రారంభానికి ముందుగానే పూర్తి చేయాలని పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.


ప్రారంభం నాటికి పూర్తి
- పబ్బరాజు రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి

ఏఏపీసీల ద్వారా పాఠశాలల్లో అవసరమైన పనులను చేపట్టి పాఠశాలలు తెరిచేనాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దిశగా కృషి జరుగుతోంది. పూర్తయితే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని